Dead Bodies: ఉత్తరాఖండ్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లాలో సరయూ నది తీరంలో భారీగా మృతదేహాలు కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. భారీగా మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మృతదేహాలు కరోనాకు సంబంధించినవని భావిస్తున్నారు. అయితే కోవిడ్ సెకండ్‌వేవ్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో పాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించిన ఘటనలు ఇటీవల సంచలనం రేపాయి.
ఈ విధంగా నదీ తీరాలలో మృతదేహాలు కనిపించడం ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని సరయూ నదిలో కూడా మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. మృతదేహాలు కనిపించిన ప్రదేశానికి 30 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంది. తాగునీటి సరఫరా కోసం ఈ నది నీటినే వాడుతుంటారు.ఈ నీరు కలుషితం కావడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ పంకజ్ చందోలా మాట్లాడుతూ నరయూ నదిలో దొరికిన మృతదేహాలు పిథౌర్‌గడ్‌కు చెందినవి కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.