ఆసుపత్రుల బయటే గంటల తరబడి కోవిడ్ రోగుల పడిగాపులు, బెడ్స్ లేక హాస్పిటల్స్ యాజమాన్యాల కలవరం

రాజస్తాన్ లోని ఉదయపూర్ కి వెళ్తే దయనీయ దృశ్యాలు కనిపిస్తాయి.  ఈ సిటీ ఆసుపత్రుల బయట బెడ్స్ కోసం నిరీక్షిస్తూ కోవిడ్ రోగులు  గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు...

ఆసుపత్రుల బయటే గంటల తరబడి కోవిడ్ రోగుల పడిగాపులు, బెడ్స్ లేక హాస్పిటల్స్ యాజమాన్యాల కలవరం
No Beds Patients Wait Hospitals Outside In Udaipur
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2021 | 11:48 AM

రాజస్తాన్ లోని ఉదయపూర్ కి వెళ్తే దయనీయ దృశ్యాలు కనిపిస్తాయి.  ఈ సిటీ ఆసుపత్రుల బయట బెడ్స్ కోసం నిరీక్షిస్తూ కోవిడ్ రోగులు  గంటలు, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఏ ఒక్క ఆసుపత్రిలోనూ ఖాళీ బెడ్ కనిపించడం లేదు. వృద్దులు, మహిళలు ఈ హాస్పిటల్స్ బయట, పేవ్ మెంట్ల మీదే కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో కోవిడ్  టెస్టు ఫలితాలకోసం వేచి ఉన్నవారు కూడా ఉన్నారు.  నగరం నుంచే కాక, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుండడంతో ఆసుపత్రుల ఆవరణలు వీరితో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక హాస్పిటల్స్ యాజమాన్యాలు తల్లడిల్లుతున్నాయి. తమ ఆసుపత్రిలో 760 బెడ్స్ ఉన్నాయని, కానీ అన్నీ భర్తీ అయిపోయాయని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధికారి ఒకరు తెలిపారు. అనేకమంది రోగులు బయటే ఉన్నారని, బెడ్స్ లేక వారిని అడ్మిట్ చేసుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. తమ నిస్సహాయతను ఆయన ప్రకటించారు.   కరోనా ఫస్ట్ వేవ్ తరువాత ప్రజల్లో కోవిడ్ రూల్స్ ను పాటించడంలో నిర్లక్ష్యం చేశారని, మాస్కులు ధరించక, భౌతిక దూరం పాటించకపోవడం వంటివాటి వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని ఆయన వాపోయారు.

తన తల్లిని అడ్మిట్ చేసేందుకు  ఓ యువకుడు నాలుగు ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆమె ఇంకా  అంబులెన్స్ లోనే ఉందని ఓ యువకుడు గద్గద స్వరంతో చెప్పాడు. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఇలా గడపాలని అన్నాడు. రాజస్థాన్ లో గురువారం 158 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం  5 లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.  దేశంలో మిగతా రాష్ట్రాల పరిష్టితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఎక్కడ చూసినా ఆసుపత్రుల వద్ద ఈ విధమైన హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.