Maharashtra: కరోనా సెకండ్ వేవ్.. అకోలా, పర్భణీలో లాక్‌డౌన్.. పూణేలో నైట్ కర్ఫ్యూ..

|

Mar 12, 2021 | 8:45 PM

Maharashtra COVID Restrictions: మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసుల ఉధృతి భారీగా పెరుగుతోంది. కొంతకాలం తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి..

Maharashtra: కరోనా సెకండ్ వేవ్.. అకోలా, పర్భణీలో లాక్‌డౌన్.. పూణేలో నైట్ కర్ఫ్యూ..
Maharashtra lockdown
Follow us on

Maharashtra COVID Restrictions: మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసుల ఉధృతి భారీగా పెరుగుతోంది. కొంతకాలం తరువాత నిన్న రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ కేసులు వేలల్లో పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించి కఠినమైన ఆంక్షలను విధించింది. మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా బయట తిరిగితే కఠినచర్యలు తీసుకుంటామంటూ స్వయంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం ప్రకటించారు. కరోనా నిబంధనలను పాటించకపోవడంతోనే కేసులు ఉధృతి పెరుగుతోందని.. రాష్ట్రంలో కరోనా అదుపులో లేదంటూ వివరించారు. కోవిడ్ కట్టడికోసం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించాల్సి వస్తుందని.. ఇప్పటికైనా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాగపూర్‌లో ఉద్ధవ్ ప్రభుత్వం గురువారమే లాక్‌డౌన్‌ను ప్రకటించింది. మళ్లీ తాజాగా అకోలా, పర్భణీ జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు పూణెలో నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.

అకోలాతోపాటు పర్భణీ జిల్లాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ అకోలా, పర్భణీ జిల్లాల్లో సోమవారం వరకు (మూడు రోజులు) లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. పూణెలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది. అంతేకాకుండా ఆయాప్రాంతాల్లో మార్చి 31 వరకూ పాఠశాలలు, కళశాలలను మూసివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ హోటళ్లను, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను మూసివేయాలని ఉత్తర్వుల్లో ప్రకటించారు. అందరూ సహకరించాలంటూ అధికారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌పై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనా నిబంధనలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించామని, రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ విధిస్తామంటూ ఆయన వెల్లడించారు. అయితే రోజూవారి కేసుల్లో మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 14వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

Also Read: