Union Minister Nitin Gadkari: భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్(Greenfield corridor projects)లు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరచారు. అందులో విశాఖపట్నం-రాయపూర్ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి 3183 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికి 202 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్ 365బీజీ) కోసం 1281 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చిత్తూరు-థాట్చూర్ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్-716బీ) కోసం 3179 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చైంది. బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేకు 4137 కోట్లు కేటాయింపు జరగ్గా ఇప్పటికి 123 కోట్ల రూపాయలు ఖర్చైంది. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్ తీరుతెన్నులు, వ్యయంకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు.
ఏపీలో 5347 కోట్లతో 28 ఆర్వోబీల నిర్మాణం
అలాగే సేతు భారతం కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 28 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌వోబీలు), రోడ్డు అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ల నిర్మాణం చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ 28 ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి 5347 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎన్‌హెచ్ 205పై చిత్తూరు జిల్లా తుమ్మనం గుంట వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు, ఎన్‌హెచ్ 40పై వైఎస్సార్ కడప జిల్లాలోని ఊటుకూరు వద్ద నాలుగు వరసల ఆర్వోబీ పనులు, ఎన్‌హెచ్ 18పై చిత్తూరు జిల్లా ముత్తిరేవుల వద్ద చేపట్టని నాలుగు వరసల ఆర్వోబీ పనులు, చిత్తూరు జిల్లాలో ఎన్‌హెచ్18పై మురకంబట్టు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఎన్‌హెచ్ 205పై రాప్తాడు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయి. చిత్తూరు జిల్లాలోని ఎన్‌హెచ్ 205పై తిరుపతి వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరుల నాటికి పూర్తవుతాయని తెలిపారు. మిగిలిన ప్రాజెక్ట్‌లలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో ఎన్‌హెచ్ 214పై నిర్మించ తలపెట్టిన ఆర్వోబీ, అదే జిల్లాలోని వీరవాసరం వద్ద తలపెట్టిన ఆర్వోబీ కోర్టు కేసుల కారణంగా నిలిపివేసినట్లు మంత్రి చెప్పారు.
Also Read..
Purandareshwari: బీజేపీ – జనసేన పొత్తుపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు
Telangana: హత్య చేసేందుకే వచ్చారంటున్న సర్పంచ్ భర్త.. అమీన్ పూర్ తుపాకీ హల్చల్ ఘటనలో కొత్త ట్విస్ట్