Delhi Railway Station Stampede: ఒకే పేరుతో రెండు రైళ్లు.. ప్రజల ప్రాణాలు తీసిన అనౌన్స్‌మెంట్.. అసలేం జరిగింది..?
ఓ అనౌన్స్‌మెంట్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటలో 18 మంది చావుకు కారణమయ్యింది. రైల్వే శాఖ ప్రాధమిక నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఘటన తరువాత ప్రయాగ్‌రాజ్ కుంభమేళా భక్తుల కోసం రైల్వే శాఖ నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అసలు ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి..? రైల్వే శాఖ ప్రాధమిక నివేదికలో ఏముంది..? ఈ వివరాలను తెలుసుకోండి..

ప్లాట్‌ఫామ్ మారిందన్న అనౌన్స్‌మెంట్ ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమని రైల్వే శాఖ ప్రాధమిక నివేదికను విడుదల చేసింది. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం 14 నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్నారు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో ఆలస్యమయ్యింది. అదే సమయంలో 12 నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై స్పెషల్ ట్రేన్ వస్తుందని ప్రకటన రావడంతో ప్రయాణికులు భారీ సంఖ్యలో అక్కడికి పరిగెత్తారు.. మెట్ల పై నుంచి జనం కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్టు రైల్వేశాఖ ప్రాధమిక నివేదికను విడుదల చేసింది.
ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్రగాయాల పాలైన 18 మందికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వేశాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్‌మెంట్ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిముషంలో ప్లాట్‌ఫామ్ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
అంతేకాకుండా ఒకే పేరుతో రెండు రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్లను కంట్రోల్ చేయడంలో RPF సిబ్బంది విఫలమయ్యారు. వాస్తవానికి ఎక్కువమంది RPF సిబ్బందిని కుంభమేళాకు తరలించడంతో చాలా తక్కువమంది సిబ్బంది ఢిల్లీ స్టేషన్‌లో ఉన్నారు. తొక్కిసలాటపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఢిల్లీసీట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ఊహించిన దాని కంటే ఎక్కువ జనరల్ టిక్కెట్లు ఇవ్వడంతో ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ వైపు దూసుకొచ్చారు. గంటకు 1500 జనరల్ టిక్కెట్లు జారీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటపై కేంద్రాన్ని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఊచకోత జరిగిందని మండిపడింది. అయితే ఈ వ్యవహారంపై రాజకీయాలు చేయడం తగదని బీజేపీ కౌంటరిచ్చింది.
తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు కూడా ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడడంతో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తరువాత మహాకుంభ్‌కు అదనంగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




