AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LOC Firing: సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం!

వక్రబుద్ధి మారని పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తెగబడింది. భారత భద్రతా సిబ్బందిపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరు గాయపడినట్లు సమాచారం లేదు. అయితే ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు.

LOC Firing: సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం!
Jammu Kashmir Loc Firing
Balaraju Goud
|

Updated on: Feb 16, 2025 | 9:24 PM

Share

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం(ఫిబ్రవరి 16) జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టుపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని, కాల్పులకు తగిన సమాధానం ఇచ్చామని భారత సైన్యం తెలిపింది.

గుల్పూర్ సెక్టార్‌లోని భారత ఆర్మీ పోస్ట్‌పై ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి అటవీ ప్రాంతం నుంచి కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ దాడిలో, దాదాపు 18 రౌండ్ల చిన్న ఆయుధాలతో కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ కాల్పులకు ప్రతిగా భారత సైన్యం 60 రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్ కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత భారత సైన్యం సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో నిఘాను కఠినతరం చేసింది. ఈ క్రమంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌కు భారత సైన్యం సరియైన బుద్ధి చెబుతోంది.

రావాలాకోట్ కేంద్రంగా పనిచేస్తున్న 2 పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) బ్రిగేడ్ ఆధ్వర్యంలోని 24 AK బెటాలియన్ నిర్వహిస్తున్న నక్కర్‌కోట్‌లోని పాకిస్తాన్ ఫార్వర్డ్ డిఫెన్సివ్ లొకేషన్ (FDL) నుండి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల వెనుక పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందా లేదా అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు చొరబడటానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

ఇటీవల, జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో జరిగిన IED పేలుడులో భారత సైన్యానికి చెందిన ఇద్దరు ధైర్య సైనికులు అమరులయ్యారు. ఆర్మీ సైనికులు సరిహద్దులో గస్తీ తిరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం తర్వాత, ఎల్‌ఓసి వెంబడి, లోతట్టు ప్రాంతాలలో సైన్యం గస్తీని భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు చొరబాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, ఉగ్రవాదుల పట్ల ఎలాంటి సహనం లేకుండా చూసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..