కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు.. 3 కీలక డిమాండ్ల సాధనకు సీజేపీ పట్టు..
నీట్ పేపర్ లీక్ అంశంపై సీజేపీ నిరసనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ క్రమంలో కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో జరిపిన మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు సీజేపీ నేతలతో రెండు గంటల పాటు చర్చించారు. ఈ క్రమంలో సీజేపీ కేంద్రం ముందు 3 డిమాండ్లను ఉంచింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ సీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నీట్ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా మూడు డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. ముందు నుంచి వారు చెప్తున్నట్లుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే వారి ఫస్ట్ డిమాండ్‌గా కేంద్రం ముందుంచారు. అదేవిధంగా నీట్ పేపర్‌లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వడంతో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి, కొత్తగా కేసులు పెట్టవద్దని కోరారు.
రేపు మరోసారి చర్చిస్తాం..
ఈ చర్చలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. రెండు గంటల పాటు సీజేపీ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. వారు ప్రధానంగా మూడు డిమాండ్లు తమ ముందు ఉంచారని చెప్పారు. అయితే ఈ డిమాండ్లకు సంబంధించి శనివారం సీజేపీ ప్రతినిధులతో మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు.
రాజీనామా చేసేవరకు తగ్గం
మరోవైపు చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లలో రెండింటికి విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, పరిహారం అంశాలకు సూత్రప్రాయంగా సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని, ఆయన రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెగేసి చెప్పారు. రేపటి రెండో విడత చర్చల్లో ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.
