NCB Operation JAL-TAL: : ఆపరేషన్ ‘జల్-తల్’.. భారత యువతను నిర్వీర్యం చేసేందుకు పాక్‌ భారీ స్కెచ్?

| Edited By: Balaraju Goud

Nov 17, 2024 | 12:36 PM

ఉగ్రవాదం ఆర్థిక, సమాచార, మాదకద్రవ్యాలు సహా అనేక రూపాలు సంతరించుకుని దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. వీటన్నింటిలో డ్రగ్స్ టెర్రరిజం ఒక తరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.

NCB Operation JAL-TAL: : ఆపరేషన్ జల్-తల్.. భారత యువతను నిర్వీర్యం చేసేందుకు పాక్‌ భారీ స్కెచ్?
Ncb Operation Jal Tal
Follow us on

ఉగ్రవాదం అనేక రూపాలు సంతరించుకుంటోంది. పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో సృష్టించే విధ్వంసాలు మాత్రమే ఉగ్రవాదం కాదు.. నకిలీ కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలు ఉగ్రవాదమే. ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి సమాచారాన్ని తస్కరించడం లేదా దోచుకోవడం కూడా ఉగ్రవాదమే. అంతేకాదు.. దేశానికి భవిష్యత్తుగా నిలవాల్సిన యువతరాన్ని మత్తులో చిత్తుచేసే మాదకద్రవ్యాలు కూడా ఉగ్రవాదమే. ఒక ముక్కలో చెప్పాలంటే.. ఉగ్రవాదం ఆర్థిక, సమాచార, మాదకద్రవ్యాలు సహా అనేక రూపాలు సంతరించుకుని దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. వీటన్నింటిలో డ్రగ్స్ టెర్రరిజం ఒక తరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.

ప్రపంచ దేశాలన్నీ వయోధికులతో సతమతవుతూ ఉంటే.. పనిచేసే సామర్థ్యం కలిగిన యువశక్తి ఎక్కువగా ఉన్న భారతదేశంపై డ్రగ్స్ కత్తి వేలాడుతోంది. దీన్ని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగా జాతీయ సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. అఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి వివిధ మార్గాల్లో మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. ఒక్కోసారి నేరుగా సరకు రవాణా మార్గంలోనే పోర్టుల ద్వారా మాదకద్రవ్యాలను మరో పేరు చెప్పి తీసుకొస్తున్న ఉదంతాలు సైతం ఉన్నాయి. టాల్కం పౌడర్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్ వంటి మాదకద్రవ్యాలను తరలిస్తూ దొరికిపోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజాగా ఎన్సీబీ చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ. 2,900 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

ఆపరేషన్ ‘జల్-తల్’

తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఘనిస్తాన్‌లో మాదకద్రవ్యాలకు అవసరమైన ముడి సరుకు పంటలను పండిస్తారన్న విషయం ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే..! మాదకద్రవ్యాల సాగు ద్వారా గడించే సొమ్ముతో ఆయుధాలు కొనుగోలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడంలో తాలిబన్లతో పాటు ఇస్లామిక్ స్టేట్ సహా అనేక ఉగ్రవాద సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అఫ్ఘనిస్తాన్‌కు సముద్ర తీరం లేనందున అక్కణ్ణుంచి డ్రగ్స్‌ను ఇరాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా సముద్రమార్గం ద్వారా భారత్‌కు చేరవేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత భద్రతా విభాగాలు అనునిత్యం డేగ కన్నుతో కాపలా కాస్తూ వాటిలో చాలావరకు మార్గమధ్యంలోనే పట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్‌ వంటి విభాగాలు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)తో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఆపరేషన్ ‘సముద్ర మంథన్’ పేరుతో ఈ తరహా ఆపరేషన్లు తరచుగా సాగుతున్నాయి. అయితే భూమార్గం నుంచి కూడా డ్రోన్ల ద్వారా, ఇతర అక్రమ మార్గాల్లో భారత్‌కు చేరుకుంటున్న మాదక ద్రవ్యాలు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. నిఘా సంస్థల సమాచారంతో ఎన్సీబీ తాజాగా అటు సముద్ర మార్గం, ఇటు భూమార్గం నుంచి భారత్ చేరుకుంటున్న డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఉభయచర ఆపరేషన్ జల్(జలం)-తల్(భూమి) ప్రారంభించింది. ఇందులో భాగంగా వారం రోజుల వ్యవధిలోనే రూ. 2,900 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. రెండు వేర్వేరు అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్లతో సంబంధం ఉందని గుర్తించింది.

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పార్శిల్

జనక్‌పురికి చెందిన శ్రీ మారుతి ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీ వద్ద ఉన్న ఓ పార్శిల్‌ అనుమానాస్పదంగా ఉన్నట్టు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కు సమాచారం అందింది. ఈ ప్యాకెట్‌ను ఆస్ట్రేలియాకు పంపించినట్టుగా గుర్తించారు. ఎన్సీబీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులో నుండి ఒక కిలోకు పైగా నాణ్యమైన కొకైన్ స్వాధీనం లభించింది. ఎన్సీబీ అధికారుల విచారణలో ఈ ప్యాకెట్‌ను ఢిల్లీలోని నంగ్లోయ్‌ ప్రాంతానికి చెందిన అవధేష్ కుమార్ అనే వ్యక్తి బుక్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అవధేష్ ఇంటికి చేరుకున్న ఎన్సీబీ అధికారులు అక్కడ మరో 75 ప్యాకెట్‌లలో ప్యాక్ చేసిన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నంగ్లోయ్‌లోని ఇల్లు, జనక్‌పురిలోని లాజిస్టిక్స్ కంపెనీ నుంచి మొత్తం 82.53 కిలోల కొకైన్‌ను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కొకైన్ మొత్తం ధర రూ.900 కోట్లకు పైగానే ఉంటుంది.

అవధేష్ యాదవ్ అంతర్జాతీయ హవాలా రాకెట్‌లో భాగమని, డ్రగ్స్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని విచారణలో తేలింది. దీని ఆధారంగా అవధేష్‌కు లాజిస్టిక్స్ సపోర్టు చేస్తున్న లోకేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ ప్రశ్నించగా.. వారికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇందులో ఒక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్న నామన్ నయ్యర్‌తో పాటు రిషి సచ్‌దేవా అనే నగల వ్యాపారి కూడా ఉన్నారు. వీరంతా ఈ డ్రగ్స్‌ రాకెట్‌లో భాగమని గుర్తించారు. ఈ కొకైన్‌ను అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి రోడ్డు మార్గంలో తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇక్కణ్ణుంచి పార్శిల్ రూపంలో ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలకు పంపిస్తున్నట్టుగా తేలింది.

జలమార్గంలో వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, భారత నావికాదళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్తంగా ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించాయి. ఆపరేషన్ ‘సాగర్ మంథన్’ కింద భారత ప్రాదేశిక జలాల్లో 700 కిలోల మెత్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. ఈ ఆపరేషన్ కింద 8 మంది ఇరానీ దేశీయులను అరెస్టు చేసింది. రికవరీ చేసిన డ్రగ్స్ ఇరాన్ నుండి పడవలో లోడ్ చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే 40 వేల కిలోల డ్రగ్స్‌ను భారత్‌కు పంపిన పాకిస్థానీ డ్రగ్ స్మగ్లర్, డి-కంపెనీ సభ్యుడైన హాజీ సలీమ్‌ దీని వెనుక ఉన్నట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ ప్రపంచంలో హాజీ సలీమ్‌ను ‘రక్త బీజ్’ అని కూడా పిలుస్తారు. అంటే తన శరీరం నుంచి జారిపడే ప్రతి రక్తపు చుక్క నుంచి మరో రాక్షసుడు పుట్టినట్టుగా హాజీ సలీం డ్రగ్స్ రాకెట్‌లో ఎంతమందిని పట్టుకున్నా సరే.. ఇంకా కొత్తవారు పుట్టుకొస్తూనే ఉన్నారు.

దేశ యువతను మత్తులో చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయంలో భాగంగా డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ క్యాంపెయిన్ కింద ఎన్సీబీ ఈ ఆపరేన్ చేపట్టింది.ఆపరేషన్ సాగర్ మంథన్ కింద మొత్తం 3,400 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సముద్రం ద్వారా వస్తున్న ఈ డ్రగ్స్‌తో ఇప్పటి వరకు 11 మంది ఇరాన్, 14 మంది పాకిస్థానీ పౌరులు అరెస్టయ్యారని, వారంతా ప్రస్తుతం జైలులో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..