Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. సంస్థాగత మార్పుల కోసం ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పలువురు పంజాబ్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించింది. సిద్ధూ.. కొంతకాలం నుంచి కెప్టెన్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సయోధ్యకు సంప్రదిస్తున్నప్పటికీ.. ఇంకా ఈ విషయం కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మరోసారి కలిశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ ఇన్‌చార్జి హరీష్ రావత్ సైతం సిద్ధూ వెంట ఉన్నారు. అయితే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్ధూను నియమించనున్నట్టు వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన సోనియాగాంధీ, రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్‌కు ఏఐసీసీలో స్థానం ఇచ్చి.. సిద్ధూతోపాటు మరో ఇద్దరికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తారని తెలుస్తుంది.
కాగా.. పంజాబ్ కాంగ్రెస్‌లో మార్పులకు సంబంధించి సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి హరీష్ రావత్ పేర్కొన్నారు. సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలికి నోట్ సమర్పించేందుకు వచ్చానని.. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయం వెలువడగానే చెబుతానంటూ పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది.
Also Read: