PM Narendra Modi: తల్లీబిడ్డలకు ఆయుష్షు పోస్తున్న మిషన్ ఇంద్రధనుష్.. నెరవేరుతున్న ప్రధాని మోడీ సంకల్పం..
స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ భారతదేశానికి సవాలుగా మిగిలిపోయింది. దేశంలో 2013లో పూర్తి టీకా కవరేజీ సుమారు 58% ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
8 Years of Modi Government: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అధునాతన వైద్యం, ఔషధాల ఉత్పత్తి, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండేలా పలు ప్రణాళికలు రూపొందించి.. ఆచరణలో పెట్టారు. అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ భారతదేశానికి సవాలుగా మిగిలిపోయింది. దేశంలో 2013లో పూర్తి టీకా కవరేజీ సుమారు 58% ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ప్రతి 1,000 మందికి మరణాల రేటు 49 గా ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 2022 మే 26తో 8 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం.. మిషన్ ఇంద్రధనుష్ పథకం (Mission Indradhanush) తో సాధించిన ఘనతపై టీవీ9 ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది.
ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2014 డిసెంబర్లో ప్రారంభించిన మొదటి సంక్షేమ కార్యక్రమాలలో మిషన్ ఇంద్రధనుష్ (Mission Indradhanush) ఒకటి. పిల్లలలో రోగనిరోధక శక్తిని 90%కి పెంచడానికి మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు పలు ప్రాంతాల్లో చర్యలు తీసుకుంది.
మిషన్ ఇంద్రధనుష్ మొదటి, రెండు దశల ఫలితంగా ఒక సంవత్సరంలో పూర్తి రోగనిరోధకత కవరేజీ 6.7% పెరిగింది. మిషన్ ఇంద్రధనుష్ (ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్) 5వ దశ పూర్తి రోగనిరోధకత కవరేజీలో 18.5% పెరుగుదలను చూపింది. 5వ దశలో 190 జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా ఇది సూచిస్తోంది.
5వ దశలో కేంద్ర ప్రభుత్వం టీకాలు వేయని లేదా పాక్షికంగా టీకాలు వేసిన పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తక్కువ రోగనిరోధకత కవరేజీపై దృష్టి సారించి పిల్లలకు టీకాలు అందేలా మోడీ ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది.
12 వ్యాధులను నివారించేందుకు..
పిల్లల్లో 12 వ్యాధులను నివారించడమే (VPD) లక్ష్యంగా టీకాను అందించడమే ఈ ప్రయత్నం. డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, హెపటైటిస్ బి, మెనింజైటిస్, న్యుమోనియా, హెమోఫిలస్ ఇన్‌ఫ్లుఎంజా టైప్ B ఇన్ఫెక్షన్‌లు, జపనీస్ ఎన్‌సెఫాలిటిస్ (JE), రోటవైరస్ వ్యాక్సిన్, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (PCV), meMRles-రుబెల్లా.. లాంటి ప్రమాదకర వ్యాధులు పిల్లలలో నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది.
5వ దశ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేశారు. దాదాపు 1 కోటి మంది గర్భిణీ స్త్రీలకు కూడా ఈ టీకాలను అందించారు.
కోవిడ్ 19 మహమ్మారి విజృంభించినప్పటికీ ఈ మిషన్ కొనసాగింది. ఫిబ్రవరి-మార్చి 2021లో రెండు విడతల్లో టీకాలు ఇచ్చారు. ఈ సమయంలో 9.5 లక్షల మంది పిల్లలు, 2.2 లక్షల మంది గర్భిణీ స్త్రీలు రోగనిరోధక శక్తిని పొందారు.
ఏప్రిల్ 2021 – ఫిబ్రవరి 2022 మధ్య 30 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలకు టీకాలు వేశారు.
దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో మిషన్ ఇంద్రధనుష్ పథకం 10 దశల్లో పూర్తయ్యింది.
అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటైన మిషన్ ఇంద్రధనుష్ ప్రతి సంవత్సరం 3 కోట్ల మంది బాలింతలు, 2.6 కోట్ల మంది శిశువులను టీకాలను అందించడే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2019 – 2021 మధ్య 12 నుంచి 23 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో.. పూర్తి రోగనిరోధకత రేటు 76.4%కి పెరిగింది.
33 కి తగ్గిన మరణాల రేటు..
2020లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు ప్రతి 1,000 మందికి.. 33కి తగ్గింది. మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఈ సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది.
మోడీ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో రెండు ప్రముఖమైన సవాళ్లను అధిగమించింది. 2014లో పోలియో, 2015లో నియోనాటల్ టెటానస్ వ్యాధులను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..