ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ప్రస్తుతం 18కి పెరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్, బీఎంసీ, ముంబయి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులకు రాజావాడి, సియాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గత కొన్నిరోజలుగా ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుర్లా ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, కూలిపోయిన భవనాన్ని ఆనుకుని ఉన్న భవనాల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భవనం కూలిన సమాచారం అందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్పొరేటర్ ప్రవీణ్ మోర్జ్కర్ విలేకరులతో మాట్లాడుతూ..ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని కాపాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
#Mumbai: Two pigeons have been rescued alive from the debris at the #Kurla crash site pic.twitter.com/Pi5ciyTN7O
— TOI Mumbai (@TOIMumbai) June 28, 2022
రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది ప్రభుత్వం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి