ట్యూషన్‌కు వెళ్లమని బాలుడిని మందలించిన తల్లి.. కాసేపటికే వాచ్‌మెన్ చెప్పింది విని తల్లి షాక్..
ముంబై నగరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ట్యూషన్‌ను వెళ్లమని తల్లి పదే పదే మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ 14 ఏళ్ల కుర్రాడు బిల్డింగ్‌పై నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మరణానిగల ఇతర కారణాలపై ఆరా తీస్తున్నారు.

ట్యూషన్‌కు వెళ్లి బాగా చదువుకొమ్మని తల్లి మందలించడంతో ఓ పద్నాలుగేళ్ల బాలుడు బిల్డింగ్‌పై నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలోని కండివాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో పంత్ ఆర్తి మక్వానా అనే 14 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటు నివసిస్తున్నాడు. బాలుడు అక్కడే ఉన్న స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో పంత్‌ను ట్యూషన్‌కు వెళ్లమని వాళ్ల అమ్మ చెప్పింది. అయితే, పంత్‌కు ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. దీంతో ట్యూషన్‌కు వెళ్లేందుకు పంత్ నిరాకరించాడు. ఎన్నిసార్లు చెప్పినా పంత్ వినకపోయే సరికి తల్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని మందలించింది. ఇక చేసేదేమి లేక పంత్ అయిష్టంగానే ట్యూషన్‌కు వెళ్తున్నట్టు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.
అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన పంత్ ట్యూషన్‌కు వెళ్లి ఉంటాడనుకొని భావించిన తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. అయితే ఇంతలోనే వారి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాడు. పంత్ భవనంపై నుంచి పడిపోయాడని తల్లికి చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తల్లి వెంటనే కిందకు వెళ్లింది. అక్కడ తన కుమారుడు రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసిన తల్లి తట్టుకోలేక పోయింది. బాలుడి మృతదేహంపై పడి ఏడవడం మొదటు పెట్టింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించి. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.