Mumbai Cop: మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌.. 50 మంది గిరిజన పేద విద్యార్థులను దత్తత తీసుకున్న రెహనా

| Edited By: Subhash Goud

Jul 15, 2021 | 8:39 PM

Mumbai Cop: పోలీసులంటే చాలా కఠినంగా ఉంటారని, మానవత్వం కూడా ఉండదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. వృత్తిపరంగా వారు అలా ప్రవర్తించినా.. వారిలో కొందరు..

Mumbai Cop: మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌.. 50 మంది గిరిజన పేద విద్యార్థులను దత్తత తీసుకున్న రెహనా
Follow us on

Mumbai Cop: పోలీసులంటే చాలా కఠినంగా ఉంటారని, మానవత్వం కూడా ఉండదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. వృత్తిపరంగా వారు అలా ప్రవర్తించినా.. వారిలో కొందరు మానవత్వాన్ని చాటుకునే పోలీసులు కూడా ఉంటారు. పోలీసు ఉద్యోగం నిర్వహించడమే కాకుండా సమాజంలో మంచి కార్యక్రమాలు చేపడుతూ మంచి గుర్తింపు పొందుతుంటారు. అలాంటి పోలీసే రెహనా షేక్‌ బాగ్వాన్‌. ముంబైలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రెహనా ఏకంగా 50 మంది పేద విద్యార్థులను దత్తతకు తీసుకుంది. అంతేకాదు..అనేక రకాలుగా సమాజ సేవ చేస్తూ ముంబై మదర్‌ థెరిసాగా గుర్తింపు పొందుతున్నారు. రాయ్‌గఢ్‌ జిల్లాలోని వాజే తాలుకాలో ఉన్న ధ్యాని విద్యాలయంలోని 50 మంది గిరిజన పిల్లలను రెహనా దత్తత తీసుకుంది. వారి చదువు, వారి బాగోగుల బాధ్యత తానే స్వీకరిస్తానని తెలిపింది. గతేడాది తన కుమార్తె పుట్టిన రోజును ఓ పాఠశాలలో నిర్వహించాలని భావించిన రెహనా ధ్యాని విద్యాలయం ప్రిన్సిపాల్‌ను సంప్రదించి కుటుంబంతోపాటు అక్కడికి వెళ్లింది. అయితే, ఆ పాఠశాలలో చాలా మంది గిరిజన విద్యార్థులకు సరైన దుస్తులు, చెప్పులు లేకపోవడం రెహనా చూసి చలించిపోయారు. వారిని ఎలాగైనా అన్ని విధాలుగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో చర్చించి ఆ ఏడాది తన కుమార్తె పుట్టిన రోజు, పండుగలకు కొత్త దుస్తులు, వేడుకలు నిర్వహించుకోకుండా ఆ డబ్బును పాఠశాలకు విరాళంగా అందజేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, విద్యార్థుల క్రమశిక్షణ.. వారి ప్రతిభను చూసిన రెహనా మనసు మార్చుకొని, విరాళం ఇవ్వడం కాదు.. వారిని దత్తత తీసుకొని, చదివిస్తానని వెల్లడించింది.

కేవలం విద్యార్థుల దత్తతే కాదు..

కేవలం విద్యార్థుల దత్తతే కాదు.. కరోనా మహమ్మారి సమయంలోనూ అనేక మందికి తనకు తోచిన విధంగా సాయమందించారు. ఆస్పత్రుల్లో పడకల సదుపాయం, రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు బాధితులకు సరిగ్గా అందించడానికి కృషి చేసిన ఆమె.. రక్తదానంలో ఎప్పుడూ ముందుంటున్నారు. అందుకే, రెహనా సేవలను మెచ్చి తాజాగా ముంబై పోలీస్‌ కమిషనర్‌ ఆమెను సత్కరించారు. మంచి చేసేవారికి మంచే జరుగుతుందన్నట్లు ఇటీవల ఆమె డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో రెహనా ఎస్సై కాబోతుంది. రెహనా షేక్‌ బాగ్వాన్‌ దత్తత నిర్ణయంపై పలువురు అభినందిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Monsoon Diet: వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Maruti Suzuki: కార్ల కంపెనీ మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. రూ.18 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌