Mother sold son and bought TV-freeze: అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా ఒత్తిగిలవలసిన బిడ్డను ఓ తల్లి కర్కశంగా అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత భర్తతో కలిసి ఖరీదైన షాపులో కొత్త టీవీ, వాహింగ్ మెషీన్, ఫ్రిజ్, బైక్ కొనుగోలు చేసింది. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా అసలు బండారం బయటపడింది. ఈ ఉదంతంలో బిడ్డ తండ్రితోపాటు విక్రయంలో పాలు పంచుకున్న మరో ఐదుగురిని పోలీసులు మంగళవారం (జూన్ 7) అరెస్టు చేశారు. బిడ్డను కొన్నవారిని సైతం అరెస్టు చేశారు. అసలేంజరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్‌లో షైన బీ (23), అంతర్ సింగ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈక్రమంలో ఆమె గర్భందాల్చింది. వారికి 15 రోజుల క్రితం బిడ్డ పుట్టడంతో ఆ బిడ్డను అంతర్ సింగ్ నిరాకరించాడు. ఈ విషయమై సదరు మహిళ తన ఇంటి యజమాని నేహాతో చెప్పుకుంది. దీంతో పూజా వర్మ, నీలం వర్మ, నేహా సూర్యవంశీ అనే ముగ్గురు మహిళలు మధ్యవర్తిత్వం వహించి శిశువును రూ.5.5 లక్షలకు కొనుగోలు చేసేందుకు దేవాస్ నివాసి లీనా సింగ్‌తో డీల్ కుదుర్చుకున్నారు. రోజువారీ కూలీ పని చేసే జంట ఖరీదైన మోటార్ సైకిల్, ఎల్‌ఈడీ టీవీ, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ కొన్నారు.
కూలి పనులు చేసుకునే వాళ్లు ఒక్కసారిగా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం, వారివద్ద బిడ్డలేకపోవడం గమనించిన ఓ సోషల్ యాక్టివిస్ట్ అనుమానంతో ఇండోర్‌లోని హీరానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు విచారణ జరపగా.. షైనా బీ (బిడ్డ తల్లి 23) లీనా అనే మహిళకు బిడ్డను లీనాకు విక్రయించినట్లు తేలింది. అందుకు పూజా, నీలమ్, నేహా, ఓ మైనర్ సహాయం చేసినట్లు తెలిసింది. చట్టవిరుద్ధమైన దత్తత కింద వీరిని అరెస్ట్ చేసినట్టు హీరానగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్ పటేల్ మీడియాకు తెలిపాడు.
పుట్టిన వారం రోజులకే కవలలను కోల్పోయామని, ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకున్నట్లు, అందుకే బిడ్డను దత్తత తీసుకున్నట్లు లీనా పోలీసులకు చెప్పింది. ఐతే దత్తత ప్రక్రియ పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుందని.. అందుకే బిడ్డను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ సతీష్ పటేల్ తెలిపారు.