అందరి కళ్లూ అయోధ్య వైపే. శతాబ్దాల నాటి కల నెరవేరి రాఘవుడి జన్మస్థలంలో అద్భుతమైన ఆలయం నిర్మితమై.. భక్తకోటికి కనుల విందు చెయ్యబోతోంది. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే రామాలయంలో అణువంతయినా మన పాత్ర ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అటువంటిది… పూజా సామగ్రిని సమర్పించే అదృష్టం దక్కితే..? అందుకే… బెంగుళూరుకు చెందిన ఆ భక్తుడి ఆనందానికి అవధుల్లేవు. అయోధ్య రామాలయంలో గర్భగుడి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కోసం హైందవ సమాజం యావత్తూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా, 130 దేశాల ప్రతినిధులు, వేలాది మంది సాధువుల సమక్షంలో జరగబోతోంది ఈ అపురూప ఆధ్యాత్మిక వేడుక. ఇదంతా ఒక ఎత్తయితే.. రాముడి గుడిలో స్వామివారి సన్నిధిలో ఉపయోగించే పూజా సామగ్రి.. ఉద్ధరిణి, హారతి పళ్లెం, కలశం చెంబు, అక్షతల ప్లేటు.. వీటి తయారీ అత్యంత పునీతమైన రీతిలో జరుగుతోంది. ముఖ్యంగా.. ఆలయ ఆవరణలో అమర్చే 42 గంటల్ని స్వామివారికి సమర్పించే భాగ్యం.. బెంగుళూరుకు చెందిన వ్యాపారి రాజేంద్ర నాయుడికి దక్కింది. వెంటనే… తమిళనాడులోని నామక్కల్‌లో ఏడు తరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఆండాళ్ మౌల్డింగ్ వర్క్స్‌ని ఆశ్రయించారాయన. ఐదు నెలల కిందట నమూనాల్ని సమర్పించారు. తయారీకి అవసరమైన ముడి లోహం వెండి, రాగి, కాంస్యం అందజేశారు. 12 వందల కిలోల బరువైన 48 గంటల తయారీకి 45 రోజులు పట్టింది. ఈ గంటలతో పాటు వెండితో రూపొందిన హారతి పాత్రలు, రెండు వింధ్యామరలు కూడా.
వీటిలో మరింత ప్రత్యేకమైనది.. హ్యాండిల్‌పై నాగ ప్రతిమతో కూడిన ఐదంతస్థుల కాంతులీనే దీపపు చిమ్నీ. వేటికవే అన్నీ మంచి నగిషీలతో కళాత్మకంగా రూపొందించినవి. గంటల బరువు ఒక్కొక్కటి 25 నుంచి 120 కిలోలు. ఈ గంటలకున్న మరో విశిష్టత ఏమిటంటే.. మోగించగానే ఓంకార నాదం వినిపించడం. బెంగళూరు నగరంలోని వేలాదిమంది భక్తుల సమక్షంలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి.. ఈ ఘంటికల్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు. స్వామివారి పూజా సామగ్రిని అందించే అదృష్టం తనకే దక్కడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు భక్తుడు రాజేంద్ర నాయుడు. అటు.. రాఘవుడి గుడిలో అమర్చాల్సిన భారీ ప్రధాన గంట ఇప్పటికే సిద్దంగా ఉంది. దీని బరువు 21 వందల కిలోలు. ఆరడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు. ఉత్తరప్రదేశ్‌లోని ఈటా జిల్లాలో 21 లక్షల ఖర్చుతో ఇది మూడేళ్ల కిందటే తయారైంది. దీనికి అదనం.. నామక్కల్‌లో తయారై బెంగుళూరులో పూజలందుకుని అయోధ్యలో పురుషోత్తముడి గుడిని అలంకరించబోతున్న ఈ పూజా సామగ్రి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..