సాదాసీదాగా ఏంట్రీ.. వచ్చి రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించిన మీనాక్షి నటరాజన్

| Edited By: Balaraju Goud

Feb 28, 2025 | 3:59 PM

గాంధీ భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ విస్తృతస్ధాయి సమావేశమైంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరగిన ఈ కీలక భేటీకి.. టీకాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా పాల్గొన్నారు.

సాదాసీదాగా ఏంట్రీ.. వచ్చి రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించిన మీనాక్షి నటరాజన్
Meenakshi Natarajan
Follow us on

డప్పుచప్పుళ్లు లేవు.. దండలు, సన్మానాలు లేవు, స్పెషల్‌ ఫ్లయిట్‌ లేదు.. కన్వాయ్‌, సెక్యూరిటీ లేదు.. సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఆమె పేరే మీనాక్షి నటరాజన్‌. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌. వచ్చీ రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించారు.

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం కోసం హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్‌ వచ్చారు. దిల్‌కుశ్ గెస్ట్‌హౌస్‌లో మీనాక్షి నటరాజన్‌ను కలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. సీఎం రేవంత్‌ వెంట పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. అయితే ఈ భేటీకి అద్దంకి దయాకర్‌ను తన వెంట తీసుకెళ్లారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, తమ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవని మీనాక్షి నటరాజన్ చెప్పారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయనీ, అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. అటు మీనాక్షి రాకపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వాన్ని, పార్టీని మీనాక్షి నటరాజన్‌ సమన్వయం చేస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో ఇప్పటి వరకూ జరిగిన వాటి గురించి మర్చిపోండి. ఇకపై మీనాక్షి ఆధ్వర్యంలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. మీనాక్షి నటరాజన్ బాగా పనిచేస్తారనే నమ్మకం ఉందని జగ్గారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..