AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం తొలి అడుగు..వాళ్లంతా ఇక ఉగ్రవాదులే..

ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత తొలిసారిగా దానిని ప్రయోగించింది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజహార్‌, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి, ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర వహించిన దావూద్‌ ఇబ్రహీంలను యూఏపీఏ చట్ట ప్రకారం ఉగ్రవాదులుగా గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటన […]

ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం తొలి అడుగు..వాళ్లంతా ఇక ఉగ్రవాదులే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 05, 2019 | 1:23 PM

Share

ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత తొలిసారిగా దానిని ప్రయోగించింది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజహార్‌, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్‌ రెహ్మాన్‌ లఖ్వి, ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర వహించిన దావూద్‌ ఇబ్రహీంలను యూఏపీఏ చట్ట ప్రకారం ఉగ్రవాదులుగా గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వీళ్లంతా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన గెజిట్‌ను కూడా విడుదల చేసింది.

పాకిస్థాన్‌కు చెందిన మౌలానా మసూద్‌ అజహర్‌ పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడని.. ముఖ్యంగా 2001లో పార్లమెంట్‌పై, కశ్మీర్ అసెంబ్లీపై దాడి చేశాడని తెలిపింది. అంతేగాక 2016లో పఠాన్‌కోట్‌ ఎయిర్ బేస్‌పై, 2017లో శ్రీనగర్‌లోని బీఎస్‌ఎఫ్‌ శిక్షణా శిభిరంపై జరిగిన దాడుల్లో ముఖ్య సూత్రధారి అని.. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడులు చేసినట్టు వెల్లడించింది. కాగా ఇప్పటికే మసూద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిందన్న విషయాన్ని గుర్తుచేసింది.

ఇక మరో ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ 2008 ముంబై ఉగ్రదాడులతోపాటు 2000లో ఎర్రకోటపై, యూపీ రాంపూర్‌లోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై, 2015లో జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై జరిపిన దాడులకు వ్యూహం రచించినట్టు తెలిపింది. అంతేగాక జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రసంస్థను నెలకొల్పాడని, అతడిని ఐక్య రాజ్య సమితి 2008లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిందంటూ పేర్కొన్నది.

ఇక లఖ్వీని 2008లోనే ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందని.. హఫీజ్‌ సయీద్‌ వ్యూహం రచించిన అన్ని దాడులకు లష్కరే తోయిబా కమాండర్‌‌గా లఖ్వీ నేతృత్వం వహించాడని తెలిపింది.

ఇక అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీంను కూడా ఉగ్రవాదిగా ప్రకటించారు. అంతర్జాతీయ మాఫియా ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడని, అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగం పంచుకున్నాడని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల వెనుక దావూద్‌ హస్తం ఉన్నదని స్పష్టం చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు దావూద్‌ సహకారం అందిస్తున్నాడని ఐక్య రాజ్య సమితి 2003లోనే గుర్తించిందని, అతడిని 2006లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

ఈ నలుగురి ఆచూకీకి రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. వీరినే కాకుండా రాబోయే రోజుల్లో మరికొందరి పేర్లు కూడా బయటకు వస్తాయన్న వార్తలు వెలువడుతున్నాయి. కేంద్రం తెచ్చిన ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం ప్రకారం ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆ చర్యలకు ప్రచారం కల్పించినా, వాటిలో వారి ప్రమేయమున్నా వారిని ఉగ్రవాదిగా ప్రకటిస్తారు.