భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం రాత్రి 9.51 నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించినట్టు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మన్మోహన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక సంతాపం ప్రకటించారు.
అవిభక్త భారతదేశంలోని పాకిస్థాన్ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. 1957-59లో ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేశారు. 1959 నుంచి1963 మధ్య కాలంలో రీడర్‌గా ఉద్యోగం చేశారు. 1963 నుంచి 1965 పంజాబ్ వర్సిటీ, చండీగఢ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
1966 నుంచి1969 వరకు ఐక్యరాజ్యసమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 1969 నుంచి 1971 మధ్య ఢిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1976 నుంచి 1980 వరకు రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్‌గా మన్మోహన్ సేవలందించారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు మన్మోహన్ సింగ్. 1985-87 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా పనిచేశారు మన్మోహన్ సింగ్.
అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మన్మోహన్ సింగ్.
2004లో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిచాక 13వ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. పదేళ్ల పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు . ప్రధానిగా రోజుకు 18 గంటలు పనిచేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు మన్మోహన్ సింగ్.
1987లో మన్మోహన్ సింగ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్‌ను వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.
మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్రం. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..