Manipur CM Biren Singh: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల(Manipur Assembly Elections) ఫలితాలు వచ్చి పది రోజులు దాటిపోయాయి. ముఖ్యమంత్రి(Chief Minister) ఎవరనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. మణిపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ(BJP Legislature Party) సమావేశంలో ఎన్ బీరెన్ సింగ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరుసగా రెండోసారి. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేంద్ర పరిశీలకుడు నిర్మలా సీతారామన్, కో సూపర్‌వైజర్ కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి బలం సరిపోవడం లేదా అంటే అదీ కాదు.. క్రితం సారిలా 21 సీట్లేమీ రాలేదు. మొత్తం 60 సీట్లలో బీజేపీ 32 స్థానాలు గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత నంబర్‌ను సంపాదించింది. ఇంతటి ఘనవిజయాన్ని సాధించి పెట్టిన బీరెన్‌సింగ్‌కే మరోసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది కూడా చాలా మంది అభిప్రాయం. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి తమ విన్నపాన్ని కూడా తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు తగదని అధిష్టానం ఆలోచిస్తోంది. సహజంగానే మణిపూర్‌లో వర్గపోరు కాసింత ఎక్కువ. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలే లేకుండా పోతాయని బీజేపీ భావిస్తోంది. అందుకే సీఎం ఎంపికలో ఆచీతూచీ వ్యవహరించింది. బీజేపీ లెజిస్లేచర్ ఫార్టీ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అందరి ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది మణిపూర్‌లో స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రస్తుతం బీరెన్‌సింగ్‌తో పాటు ముఖ్యమంత్రి పదవి కోసం బిస్వాజిత్ సింగ్ కూడా పోటీపడ్డారు. ఈయన పేరును కూడా అధిష్టానం పరిశీలించింది. బీరెన్‌సింగ్‌కు, బిస్వాజిత్‌కు ఏ మాత్రం పొసగదు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలేమీ లేవు. కిందటిసారి బీరెన్‌ను ముఖ్యమంత్రి చేయడం బిస్వాజిత్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకు కారణం 2017 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్న బీరెన్ సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరడమే! ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినవి 21 సీట్లే. కాంగ్రెస్‌కు వచ్చినవి 28 స్థానాలు. అయినా బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అక్కడ కమలం విరబూయడానికి బీరెన్‌సింగ్ కీలక పాత్ర వహించారు. రాజకీయాలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఇతర పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీఎం కావడానికి ఇవి ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యాయి. అప్పుడే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారంటూ కొందరు సన్నాయి నొక్కుళ్లు నొక్కారు కానీ తర్వాతర్వాత రాజీపడిపోయారు. కానీ బిస్వాజిత్ మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేదు. బీరెన్‌ను మార్చి బిస్వాజిత్‌కు సీఎం పదవి ఇవ్వాలంటూ రెండుమూడు సార్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదుల వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికైనా బిస్వాజిత్ తనకు ఎర్త్ పెట్టేట్టు ఉన్నారని భావించిన బీరెన్ ఎంటనే ఆయన అధికారాలలో కోత విధించారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆయనను తొలగించారు. అప్పుడు అధిష్టానం ఇద్దరిని పిలిచి తలంటు పోసింది. అయినా బిస్వాజిత్ మాత్రం సీఎం పదవి కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు మళ్లీ బీరెన్‌ను సీఎం సీటులో కూర్చోబెడితే బిస్వాజిత్ గమ్మున ఉండరని బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే మూడో పేరును తెరపైకి తెచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ బలపరుస్తున్న యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ పేరును కూడా సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నామంటూ అధిష్టానం లీకులు వదిలింది. శనివారం రోజున ఢిల్లీ నుంచి ఖేమ్‌చంద్‌కు కబురు కూడా అందింది. శనివారం రోజున బీజేపీ పెద్దలు బీరెన్, బిస్వాజిత్, ఖేమ్‌చంద్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం ఈ త్రయం ఇంఫాల్‌కు వచ్చేసింది. వీరు మణిపూర్‌కు అలా చేరారో లేదో ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజ్జులు కూడా మణిపూర్‌కు వెళ్లారు. ఆదవారం జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎన్ బీరెన్ సింగ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరుసగా రెండోసారి.
మరో సీనియర్ నేత గోవింద్‌దాస్ కొంతౌజమ్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో ఈ విషయాన్ని చెప్పించారు కూడా! అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు అభయం కూడా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఖేమ్‌చంద్‌సింగ్ పేరును ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించడంతో మణిపూర్ రాజకీయం ఆసక్తిగా మారింది. వాస్తవానికి బీరెన్‌సింగ్ కంటే రాజకీయాలలో ఎంతో సీనియర్ అయిన బిస్వాజిత్‌కే సీఎం పదవి ఇవ్వాలి. ఇస్తే వర్గ పోరు తీవ్రతరమవుతుందేమోనన్న అనుమానం అధిష్టానానిది. తమలో ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అందరం కలిసికట్టుగానే ఉన్నామని బిస్వాజిత్ చెబుతున్నప్పటికీ బీజేపీలో వర్గ పోరు ఉన్నదన్నది మాత్రం నిజం.
ఇదిలావుంటే, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2017లో కాంగ్రెస్‌కు 28 సీట్లతో పోలిస్తే కేవలం 21 సీట్లు ఉన్నప్పటికీ, రెండు స్థానిక పార్టీలు – ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్‌లతో చేతులు కలపడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మెజారిటీ సాధించింది.
Read Also…
KTR US Tour:పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. ఘనస్వాగతం పలికిన ప్రవాసీలు