శుభవార్త.. మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌ చార్జీ.. ఫాస్టాగ్‌తో రూ.20 వేల కోట్ల ఆదా: మంత్రి నితిన్‌ గడ్కరీ

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్‌ నుంచి..

శుభవార్త.. మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌ చార్జీ.. ఫాస్టాగ్‌తో రూ.20 వేల కోట్ల ఆదా: మంత్రి నితిన్‌ గడ్కరీ
Follow us
Subhash Goud

| Edited By: Venkata Rao

Updated on: Mar 02, 2021 | 8:06 AM

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్‌ నుంచి దిగిపోయిన పాయింట్‌ వరకు ప్రయాణించిన మేరే టోల్‌ చార్జీలను ఇందులో చెల్లించవచ్చని అన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ. 20 వేల కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ. 10వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే టోల్‌ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్‌ వ్యవస్థను విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశ వ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టోల్‌ ప్లాజాల వద్ద చోటు చేసుకుంటున్న జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని అన్నారు. టోల్‌ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. టోల్‌ ప్లాజాను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయ పన్ను, జీఎస్‌టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్లు మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

కాగా, టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్స్‌ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి వాహనానికి ఫాస్టాగ్స్‌ ఉండేలా చర్యలు చేపడుతోంది. నగదు రహితను ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇటీవల కేంద్రం ఫాస్టాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనదారులకు ఉచితంగానే ఫాస్టాగ్స్‌ను అందిస్తోంది. ఇప్పటికే ఫాస్టాగ్స్‌ను చాలా వాహనాలకు ఉండగా, కొన్ని వాహనాలకు లేకపోవడంతో కేంద్రం ఉచితంగా అందించేందుకు చర్యలు చేపడుతోంది. టోల్‌ గేట్ల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో టోల్‌ కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలు సులభతరం చేసేందుకు కేంద్రం ఈ విధానం అమలు చేస్తోంది. ఫాస్టాగ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే టోల్‌ గేట్ల వద్ద వాహనం ఆపకుండా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఇతర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా గమ్యాన్నని చేరుకోవచ్చు.

ఇవి చదవండి:

Special Tea: గంగూలీ టీ స్టాల్‌లో టీ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.. అక్షరాల వెయ్యి రూపాయలు.. !

కరోనా ఎఫెక్ట్‌: న్యాయవాదికి మాస్క్‌ లేనందున కోర్టులో వాదించేందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. విచారణ వాయిదా