చండీగఢ్, జనవరి 24: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఈ క్రమంలో హరియాణా విషాదం చోటు చేసుకుంది. రాంలీలా నాటకం వేస్తూ హనుమంతుడి వేషాధారణ వేసుకున్న వ్యక్తి స్టేజి పైనే శ్రీరాముడి పాదాల వద్ద గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. హరియాణాలోని భివానీలోని జవహర్ చౌక్ ప్రాంతంలో శ్రీరాముని గౌరవార్థం నిర్వహించిన ‘రాజ్ తిలక్’ అనే కార్యక్రమంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
సోమవారం అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ నాటకంలో భాగంగా హరీష్ మెహతా (62) అనే వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పాట ద్వారా శ్రీరాముని పట్టాభిషేకం ప్రదర్శించారు. పాట ముగిసిన తర్వాత హనుమంతుడి వేషదారణలో ఉన్న హరీష్ శ్రీరాముడి పాదాల వద్ద ప్రార్ధనలు చేయవల్సి ఉంది. హరీష్ రామ పాత్రదారి పాదాల వద్ద చేరి నమస్కరించే క్రమంలో ‘జైశ్రీరాం’ అంటూ ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. అయితే ఇదంతా నాటకంలో భాగమని భావించిన ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాడనుకుని అంతా చప్పట్లు కొట్టారు. కానీ ఎంతకూ అతను లేవకపోవడంతో ప్రేక్షకులంతా కలవరపాటుకు గురయ్యారు. దీంతో హనుమాన్ వేషధారణలో ఉన్న హరీష్ మెహతాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లు ధృవీకరించారు. కాగా హరీశ్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అతను గత 25 యేళ్లుగా రంగస్థలంపై హనుమంతుని పాత్రను పోషిస్తున్నాడు. అయోధ్యలోని రామ మందిరపు ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయంలో హరీష్ మెహతా హఠాన్మరణం స్థానికంగా విషాదం నింపింది.
కాగా సోమవారం జరిగిన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట రోజున శ్రీవాస్తవ (65) అనే వృద్ధుడు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ‘ ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకను చూసేందుకు వెళ్లి, అక్కడ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అతనికి ఆన్-సైట్ చికిత్స అందించి, ప్రాణాలు కాపాడారు. అతని పరిస్థితి కుదుటపడిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం శ్రీవాస్తవను సివిల్ ఆసుపత్రికి తరలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామాలయంలో ప్రతిష్ఠాపనను గ్రాండ్‌గా నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ల వద్ద టీవీ, సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.