Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా ఆయనకే ఛాన్స్..! షిండే ప్రకటనతో రూట్‌ క్లియర్‌.. ఇవాళ ఢిల్లీలో మహాయుతి భేటీ

|

Nov 28, 2024 | 2:11 PM

మహారాష్ట్ర సీఎం ఎవరన్నది గురువారం తేల్చబోతోంది బీజేపీ హైకమాండ్‌. ఏక్‌నాథ్ షిండే రేసు నుంచి తప్పుకోవడంతో బీజేపీ నేత ఫడ్నవీస్‌కు రూట్‌ క్లియరయ్యింది. మోదీ, అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు షిండే..

Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా ఆయనకే ఛాన్స్..! షిండే ప్రకటనతో రూట్‌ క్లియర్‌.. ఇవాళ ఢిల్లీలో మహాయుతి భేటీ
Maharashtra Cm
Follow us on

మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు రూట్‌క్లియర్‌ అయ్యింది. గురువారం మహారాష్ట్ర సీఎం పేరును బీజేపీ హైకమాండ్‌ ఢిల్లీలో ప్రకటించబోతోంది. మహారాష్ట్ర సీఎం ఎంపికపై గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.. ఈ సమావేశానికి మహాయుతి నేతలు హాజరుకానున్నారు.. BJP అగ్రనేత అమిత్ షా.. షిండే, పవార్, ఫడ్నవీస్‌ సమావేశం కానున్నారు. సీఎం ఎవరన్నది ఈ సమావేశం అనంతరం ప్రకటించనున్నారు.. సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది.. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి సీఎం పదవి ఆ పార్టీ నేతకే వరించే ఛాన్స్‌ ఉంది.

మహాయుతి నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు.. రాత్రి వినోద్ తావ్డేతో సమావేశమై సుధీర్ఘంగా చర్చించిన అమిత్ షా.. షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించకపోతే మరాఠా సామాజిక వర్గం ఎలా స్పందిస్తుంది.. అన్న అంశంపై చర్చించారు.. ఈ నేపథ్యంలోనే..

క్లారిటీ ఇచ్చిన షిండే..

ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకుంటునట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు శివసేన నేత ఏక్‌నాథ్‌షిండే.. బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, నరేంద్ర మోదీ – అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు షిండే.. సీఎం పదవి కోసం తాను అలిగి , ఇంట్లో కూర్చునట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఏక్‌నాథ్‌ షిండే. పోరాటం తన రక్తంలోనే ఉందన్నారు. సీఎం అంటే కామన్‌మ్యాన్‌ అన్న భాష్యం చెప్పారు. తాను ముఖ్యమంత్రిలా ఎప్పుడు భావించలేదని, ఒక సామాన్యుడి లాగే పదవిలొ కొనసాగినట్టు స్పష్టం చేశారు. ఈ విజయం తమపై ఇంకా బాధ్యతను పెంచిందని.. మహాయుతి సర్కార్‌, కేంద్రం కలిసి పనిచేస్తాయన్నారు. బీజేపీ అగ్రనేతలు ఏ నిర్ణయం తీసుకున్నా .. ఆ పార్టీ నుంచి సీఎంను ఎంపిక చేసినా పూర్తిగా సమర్ధిస్తా అంటూ తెలిపారు.

ఫడ్నవీస్ ఏమన్నారంటే..

సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు ఫడ్నవీస్‌.. మోదీ,అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. మూడు పార్టీలు చర్చించుకొని తుదినిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

ఎన్నికలకు ముందే షిండేనే సీఎం అని మహాయుతి కూటమి ప్రచారం చేసిందని, ఇప్పుడు ఇలా జరగడంపై శివసేన కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. బీజేపీ 132 మంది ఎమ్మెల్యేల బలం ముందు షిండే సరెండర్‌ కావల్సిన పరిస్థితులు వచ్చినట్టు చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్‌ పిలుపుతో ఫడ్నవీస్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఏక్‌నాథ్‌షిండే , అజిత్‌పవార్‌ కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ముగ్గురితో చర్చించిన తరువాత సీఎం పేరును బీజేపీ హైకమాండ్‌ ప్రకటించబోతోంది. డిసెంబర్‌ 2వ తేదీన ఫడ్నవీస్‌ ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో పాటు శివసేన నుంచి ఒకరు , ఎన్సీపీ నుంచి ఒకరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయబోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..