Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు గువాహటిలోని స్టార్ హోటల్‌లో ఉన్న తమ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ముంబయికి రప్పించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు బీజేపీ చకచకా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశమయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించాలని కోరుతూ ఫడ్నవీస్ గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు. ఫడణవీస్ వెంట బీజేపీ నేతలు గిరీశ్ మహాజన్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నారు. బలనిరూపణ విషయంపై గవర్నర్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జూన్ 30న బలనిరూపణ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ ఆదేశించారన్న వార్తలను రాజ్‌భవన్ ఖండించింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని పేర్కొంది.
గవర్నర్‌తో భేటీకి ముందు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు.మహారాష్ట్ర సంక్షోభానికి తెరదించే అంశంపైనే ఈ మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌షిండే వర్గంతో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఫడ్నవీస్ సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ముంబయికి చేరుకున్న దేవేంద్ర.. విమానాశ్రయం నుంచి నేరుగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ నివాసానికి వెళ్లారు. మెజారిటీ కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి అసెంబ్లీలో బలనిరూపణ చేసేలా అవకాశం కల్పించాలని లేఖ సమర్పించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..