AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Price: ఎల్ నినో ఎఫెక్ట్.. అక్కడ రూ.100 కి చేరిన పాల ధర

మహారాష్ట్రలోని భీవండిలో పాల ధర లీటరుకు రూ.100కి చేరింది. ఎల్ నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు దీనికి కారణం. అధిక ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతుంటే, రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

Milk Price: ఎల్ నినో ఎఫెక్ట్.. అక్కడ రూ.100 కి చేరిన పాల ధర
Milk Price
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2026 | 6:34 PM

Share

దేశంలో ఎల్ నినో ప్రభావం నిత్యావసర వస్తువులపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే బియ్యం ధరలు పెరుగుతుండగా, తాజాగా పాల ధరలు కూడా డబుల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని భీవండిలో లీటరు పాల ధర ఏకంగా రూ.100కి చేరడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ముఖ్యమైన పోషకాహారమైన పాలు, సామాన్యులకు భారంగా మారాయి. భీవండి ప్రాంతంలో స్థానిక పాడి రైతులు అమ్మే తాజా పాలు లీటర్‌కు దాదాపు రూ.100కి చేరుకోవడం ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ధరల పెరుగుదలపై వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, పాడి రైతులు మాత్రం ఈ రూ.100 ధర కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. పశువుల మేత, దానా, ఎండుగడ్డి, పశువుల కొనుగోలు ధరలు విపరీతంగా పెరగటమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని భీవండి తాలూకా మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు.

గత 20-25 రోజుల్లోనే పశువుల దానా ధరలు భారీగా పెరిగాయని రైతులు తెలిపారు. ముఖ్యంగా, ఆయిల్ కేక్ ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగింది. ఎండుగడ్డి, వరిగడ్డి, జొన్న, సజ్జ కాడల ధరలు కూడా భారీగా పెరిగాయి. పశువుల కొనుగోలు ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ఆవుల రేటు లక్ష పైనే ఉండగా, గేదెల రేట్లు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు చేరాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది. ఈ పెరిగిన ఖర్చులకు అనుగుణంగా పాల ధరను పెంచక తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు కూడా పాడి రైతుల దయనీయ పరిస్థితులకు కారణమయ్యాయి. ఎల్ నినోతో సకాలంలో వర్షాలు పడకపోవడం, తీవ్రమైన అనావృష్టితో దేశవ్యాప్తంగా పచ్చగడ్డి, పశుగ్రాసం, పంట దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. దానా తయారీకి ఉపయోగించే ముడి సరుకుల కొరత ఏర్పడటంతో ఫీడ్ ధరలు అసాధారణంగా పెరిగాయి. పశువులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించలేక రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.

వాతావరణ వైపరీత్యాల కారణంగా పాడి పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడం, పెరిగిన ఖర్చులకు తగినట్లుగా ప్రొక్యూర్మెంట్ ధరలు రాకపోవటంతో జీవనం సాగించటం కష్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినియోగదారులు అధిక ధరలతో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు రైతులు ఉత్పాదక ఖర్చుల భారాన్ని మోయలేక సతమతమవుతున్నారు. ఎల్ నినో పరిస్థితులతో ఏర్పడిన మేత కొరతను అధిగమించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు ఆర్థిక సహాయం అందించాలని పాడి రైతులు కోరుతున్నారు. ఈ సంక్షోభం పాడి పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది, దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Follow Us