AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ అర్హతతో RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్‌ 1688 రైల్వే ఉద్యోగాలు.. రూ.40 వేల వరకు జీతం!

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఇంటర్మీడియట్‌ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 1,688 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదలైంది. కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, ట్రైన్స్‌ క్లర్క్‌ పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు, అవసరమైన పోస్టులకు టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. దరఖాస్తు తేదీలు, అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఇంటర్ అర్హతతో RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్‌ 1688 రైల్వే ఉద్యోగాలు.. రూ.40 వేల వరకు జీతం!
RRB NTPC UG Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 21, 2026 | 4:42 PM

Share

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) విభాగంలో ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామకాల ద్వారా మొత్తం 1688 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హతతో 3,548 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా, ఇప్పుడు ఇంటర్ అర్హత ఉన్నవారికి కూడా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అర్హులైన అభ్యర్థులు నవంబరు 13, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏయే పోస్టులు ఉన్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుల సంఖ్య: 700
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టుల సంఖ్య: 200
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టుల సంఖ్య: 600
  • ట్రెయిన్స్ క్లర్క్ పోస్టుల సంఖ్య: 188

అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సాధారణంగా కనీసం 50 శాతం మార్కులు అవసరం. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఈ కనీస మార్కుల నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు లేకపోయినా అర్హత పొందవచ్చు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది. ఇతర వర్గాల అభ్యర్థులకు రూ.500 ఫీజు నిర్ణయించారు. పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం బ్యాంకు ఛార్జీలు మినహాయించి ఫీజులో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు ఎంపికైనవారు లెవెల్ 3 పే స్కేల్ ప్రకారం రూ.21,700 మూల వేతనం పొందుతారు. అలవెన్సులు కలిపితే నెలకు సుమారు రూ.40,000 వరకు జీతం అందే అవకాశం ఉంటుంది. మిగిలిన మూడు రకాల పోస్టులు లెవెల్-2 కిందకు వస్తాయి. వీటికి రూ.19,900 మూల వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులు కలిపి నెలకు సుమారు రూ.36,000 వరకు పొందవచ్చు. వాస్తవ జీతం పోస్టింగ్ ప్రాంతం, వర్తించే అలవెన్సులు, ఇతర నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

ఈ ఉద్యోగాలకు ప్రధానంగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహిస్తారు. టైపిస్టు పోస్టులకు అదనంగా టైపింగ్ స్కిల్ టెస్టు ఉంటుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

స్టేజ్ 1 పరీక్ష విధానం

మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్: 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 30 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

స్టేజ్ 2 పరీక్ష విధానం

స్టేజ్ 1లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్, కేటగిరీ వారీ ఖాళీల ఆధారంగా తదుపరి దశకు ఎంపిక చేస్తారు. సాధారణంగా ఖాళీలకు 15 రెట్ల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. స్టేజ్-2లో మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్: 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 35 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. రెండు దశల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. అర్హత మార్కులు కేటగిరీని బట్టి మారుతాయి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న కనీస అర్హత మార్కులను పరిశీలించాలి.

టైపింగ్ స్కిల్ టెస్టు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టులకు కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. స్టేజ్-2లో అర్హులైనవారిలో మెరిట్, కేటగిరీ వారీ ఖాళీల ఆధారంగా సాధారణంగా ఎనిమిది రెట్ల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఇంగ్లిష్ టైపింగ్: నిమిషానికి 30 పదాలు, హిందీ టైపింగ్: నిమిషానికి 25 పదాలు టైప్‌ చేయాలి. ఈ పరీక్షలో నిర్దేశించిన టైపింగ్ వేగాన్ని సాధించడం తప్పనిసరి.

అభ్యర్థులు పరీక్షకు అందుబాటులో ఉన్న భాషలలో తెలుగును ఎంచుకోవచ్చు. కాబట్టి తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులు కూడా ప్రణాళికాబద్ధంగా సిద్ధమై పోటీ పడవచ్చు. అయితే పరీక్ష భాషల లభ్యతను అధికారిక నోటిఫికేషన్‌లో నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు ఒక ఆర్‌ఆర్‌బీ పరిధిలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ అర్హత ఉన్నవారు ఇంటర్, డిగ్రీ స్థాయి ఎన్‌టీపీసీ పోస్టులకు పోటీ పడాలనుకుంటే రెండు నోటిఫికేషన్లకు విడివిడిగా దరఖాస్తు చేయాలి. వాటి పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us