AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న గొడవ.. తీరని విషాదం! 8 నెలలకే ముగిసిన నవదంపతుల సంసారం!

పెళ్లయి కేవలం ఎనిమిది నెలలే అయింది. దాంపత్య జీవితంలో చిన్నపాటి వివాదం చివరకు విషాదానికి దారితీసింది. భర్త తనను బయటకు తీసుకెళ్లలేదనే విషయంపై మనస్తాపానికి గురైన ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని క్రోమ్‌పేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

చిన్న గొడవ.. తీరని విషాదం! 8 నెలలకే ముగిసిన నవదంపతుల సంసారం!
Tragedy
Balaraju Goud
|

Updated on: Oct 21, 2026 | 3:17 PM

Share

చెన్నై: పెళ్లయి కేవలం ఎనిమిది నెలలే అయింది. దాంపత్య జీవితంలో చిన్నపాటి వివాదం చివరకు విషాదానికి దారితీసింది. భర్త తనను బయటకు తీసుకెళ్లలేదనే విషయంపై మనస్తాపానికి గురైన ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని క్రోమ్‌పేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, మహిళ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది?

చెన్నై జిల్లా క్రోమ్‌పేట్ సమీపంలోని నెమిలిచెర్రీ ఫాతిమా నగర్‌లో జగదీశన్ (28), అతని భార్య అరుణ (26) నివసిస్తున్నారు. జగదీశన్ పల్లవరంలోని ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. ఈ నేపథ్యంలో ఆయుధ పూజ సెలవు సందర్భంగా తనను బయటకు తీసుకెళ్లాలని అరుణ భర్తను కోరింది. అయితే, తాను స్నేహితులతో బయటకు వెళ్లాల్సి ఉందని, ప్రస్తుతం ఆమెను బయటకు తీసుకెళ్లడం సాధ్యం కాదని జగదీశన్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం జగదీశన్ తన స్నేహితులతో బయటకు వెళ్లిపోయాడు.

ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా భార్య!

కొంతసేపటి తర్వాత జగదీశన్ ఇంటికి తిరిగి వచ్చాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా, అరుణ చీరతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతడు గట్టిగా కేకలు వేశాడు. అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని అరుణను కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆర్టీఓ విచారణకు ఆదేశాలు

సమాచారం అందుకున్న చిట్లపాక్కం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అరుణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, భర్త జగదీశన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహమై ఎనిమిది నెలలే కావడంతో, ఈ ఘటనపై తాంబరం ఆర్డీవో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మహిళ మృతికి దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ముఖ్య గమనిక: చిన్నపాటి వివాదాలు ఎదురైనప్పుడు పరస్పరం మాట్లాడుకోవడం, అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ముఖ్యం. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మీరు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా లేదా ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తున్నా, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. భారతదేశంలో టెలి-మానస్ మానసిక ఆరోగ్య సహాయ సేవలను 14416 నంబర్‌లో సంప్రదించవచ్చు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us