ముంబై, డిసెంబర్ 29: ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ భర్త అడవి మృగంకన్నా హీనంగా ప్రవర్తించాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటిం.. బాలింత భార్యను సజీవంగా హతమార్చాడు. దీంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలో శనివారం (డిసెంబర్ 28) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని గంగాఖేడ్ నాకా వద్ద కుండ్లిక్ ఉత్తమ్ కాలే (32) అనే వ్యక్తికి వివాహమై ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగారు. మూడో సారి గర్భం దాల్చిన మైనా గురువారం రాత్రి ప్రసవించగా.. మళ్లీ ఆడపిల్ల పుట్టింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుడితే.. ప్రాణాలు తీస్తానని గతంలో భర్త ఉత్తమ్ కాలే పలుమార్లు భార్యను, ఆమె పుట్టింటి వారిని బెదిరించాడు. ఈ విషయమై దంపతుల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో తాజాగా భార్య మైన ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఉత్తమ్ కాలే ఈ విషయమై శనివారం రాత్రి భార్యతో మరోమారు గొడవపడ్డాడు. తీవ్ర కోపోధ్రిక్తుడైన భర్త ఉత్తమ్ కాలే.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
దీంతో మైనా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆమె శరీరం చాలా వరకు కాలిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. నిందితుడు కాలేపై మైనా సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంగాఖేడ్ పోలీసులు కాలేను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.