Gadchiroli Murders: ఇరవై రోజుల్లో 5 వరుస హత్యలు.. ఒకరి తర్వాత ఒకరుగా ఆ ఇంట్లో మిస్టరీ మరణాలు!

|

Oct 19, 2023 | 4:01 PM

మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఇద్దరు మహిళలు ఓ కుంటుంబాన్ని దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబంపై పగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని విషంపెట్టి మట్టుబెట్టారు. ఎంతో తెలివిగా పక్కాప్లాన్‌తో ఒకే ఇంట్లో ఐదుగురిని చంపేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ వరుస మరణాలు వెలుగు చూడటంతో ఖాఖీలు రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తులో హంతకుల గుట్టు రట్టయ్యింది. ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలున్న ఓ మహిళ, అదే కుటుంబం..

Gadchiroli Murders: ఇరవై రోజుల్లో 5 వరుస హత్యలు.. ఒకరి తర్వాత ఒకరుగా ఆ ఇంట్లో మిస్టరీ మరణాలు!
Gadchiroli Murders
Follow us on

ముంబయి, అక్టోబర్‌ 19: మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఇద్దరు మహిళలు ఓ కుంటుంబాన్ని దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబంపై పగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని విషంపెట్టి మట్టుబెట్టారు. ఎంతో తెలివిగా పక్కాప్లాన్‌తో ఒకే ఇంట్లో ఐదుగురిని చంపేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ వరుస మరణాలు వెలుగు చూడటంతో ఖాఖీలు రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తులో హంతకుల గుట్టు రట్టయ్యింది. ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలున్న ఓ మహిళ, అదే కుటుంబం వల్ల వేధింపులకు గురైన మరో మహిళ కలిసి ఓ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. అందుకు పథకం పన్ని, దాన్ని అమలు చేశారు. ఇలా ఇరవై రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా అయిదుగురి ప్రాణాలు బలి తీసుకున్నారు. ఎక్కడ జరిగిందంటే..

ఆ ఇద్దరూ చేతులు కలిపి..

మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ దంపతులు కుటుంబంతో కలిసి జీవించేవారు. వీరి సంతానంలో రోషన్‌ అనే వ్యక్తి సంఘమిత్ర అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం అతని తల్లిదండ్రులు శంకర్‌, విజయలు ఇష్టంలేదు. పెళ్లి తర్వాత సంఘమిత్రను అత్తమామలు, భర్త సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో వీరిపై పగను పెంచుకున్న సంఘమిత్ర అదును కోసం వేచి ఉంది. ఇక రోసా అనే మరో మహిళకు అదే కుటుంబంతో పూర్వికుల ఆస్తికి సంబంధించి తగాదాలు ఉన్నాయి. వీరిద్దరు చేతులు కలిపారు. రంగు, రుచి, వాసన లేని హెవీ మెటల్ ఆధారిత ఓ రసాయనాన్ని తెలంగాణ నుంచి తెప్పించారు. బాధిత కుటుంబం తినే ఆహారం, తాగే నీళ్లలో ఈ మందును కలిపారు.

సెప్టెంబరు 20న శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తిన్న ఆహారంలో ఈ మందు కలిపారు. అది తిన్న తర్వాత వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు, గుండెనొప్పి వచ్చాయి. నాగ్‌పుర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 26న శంకర్‌ మరణించాడు. ఆ మరుసటిరోజు అతని భార్య విజయ చనిపోయింది. అదే ఆహారం తిన్న డ్రైవర్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు నిలుపుకున్నాడు. ఈ ఘటనను మరువకముందే శంకర్‌ దంపతుల కుమార్తెలు కోమల్‌, ఆనంద, కుమారుడు రోషన్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా అక్టోబరు 8న కోమల్‌ మృతి చెందగా.. 14న ఆనంద, ఆ మరుసటిరోజు రోషన్‌ మరణించారు.

ఇవి కూడా చదవండి

అందరికీ అవే లక్షణాలు..

ఈ అనుమానాస్పద మరణాలు బంధువులు, స్థానికుల్లో కలకలం సృష్టించింది. మృతులందరిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపించాయి. తొలుత అవయవాల జలదరింపు, తీవ్రమైన వెన్నునొప్పి, తలపోటు, పెదవులు నల్లగా మారడం, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మరణాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్‌ 15 మధ్య సంభవించాయి. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన శంకర్‌ మరో కుమారుడు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సకాలంలో చికిత్స అందడంతో అతను బతకగలిగాడు. ఆ కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చిన బంధువు ఒకరు ఇదే విధమైన లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషప్రయోగంగా వైద్యులు అనుమానించినప్పటికీ వైద్య పరీక్షల్లో నిర్ధారించలేకపోయారు.

పోలీసుల విచారణలో అసలు సంగతి వెలుగులోకి..

ఈ మిస్టరీ డెత్‌ల వెనుక అసలు కారణాన్ని రాబట్టేందుకు అధికారులు 5 పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు తొలుత మృతుడు రోషన్‌ భార్య సంఘమిత్రపై నిఘా ఉంచారు. అలాగే మృతురాలు విజయకు మరదలి వరస అయిన రోసా సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంపై ఆ కుటుంబంపై పగ పెంచుకుంది. దీంతో సంఘమిత్రతో చేతులు కలిపిన రోసా విషప్రయోగం చేసి ఆ కుటుంబాన్ని హతమార్చారు. మరో దారుణం ఏంటంటే.. చావుబతుకుల మధ్య ఉన్న శంకర్‌, విజయ దంపతులను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనూ విషం కలిపిన నీటిని రోసా వారికి తాగించింది.

అందులో ఆయుర్వేద గుణాలున్నాయని చెప్పడంతో డ్రైవరు కూడా ఆ నీటిని తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా బాధితుల ఆహారం, నీళ్లలో రహస్యంగా విషాన్ని కలిపేవారని.. వీళ్ల వక్రబుద్ధి తెలియక బాధిత కుటుంబం చనిపోయినట్లు ఎస్పీ నీలోత్పాల్‌ మీడియాకు వివరించారు. నిందితులు సంఘమిత్ర, రోసాలను పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనిపై గడ్చిరోలి పోలీసుల తదుపరి విచారణ కొనసాగుతోందని, ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా ఉందేమోననే కోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు ఎస్పీ నీలోత్పాల్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.