Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్చాలని ఆప్ వినతి.. కారణం ఏంటంటే..?
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ తేదీని మార్చాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ డిమాండ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మద్ధతు ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ఇది వరకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఓటింగ్..

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ తేదీని మార్చాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ డిమాండ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మద్ధతు ఇస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ఇది వరకు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఛాత్ పూజ కారణంగా రెండో విడత పోలింగ్ తేదీని మార్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆప్ లేఖ రాసింది. ఛాత్ పూజను నవంబరు 17 నుంచి 20 వరకు జరుపుకోనున్నారు. నవంబరు 17న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ఆప్ తన లేఖలో పేర్కొంది. నవంబరు 17వ తేదీకి బదులు నవంబరు 25న పోలింగ్ నిర్వహించాలని ఛత్తీస్‌గఢ్ ఆప్ ఇంఛార్జి సంజీవ్ ఝా కోరారు. నవంబరు 17 నుంచి 20 వరకు ఛాత్ పూజ ఉన్నందున.. చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్తుంటారని అన్నారు. నవంబరు 17న పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం భారీగా తగ్గే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే తాము ఈ మేరకు రెండో విడత పోలింగ్ తేదీని మార్చాలని కోరుతూ ఈసీకి లేఖ రాసినట్లు తెలిపారు. దీనికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మద్ధతు ఇస్తున్నందున.. ఆ దిశ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. అజిత్ జోగి తనయుడు అమిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ) కూడా బరిలో నిలుస్తోంది. ఇక్కడ గోండ్వానా గంతంత్ర పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. దీంతో పాటు ఛత్తీస్‌గఢ్ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
అంతకు ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. భూపేష్ బఘేల్ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీకి కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితంకాగా.. జేసీసీ ఐదు సీట్లు, బీఎస్పీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం ఓట్లు దక్కగా.. బీజేపీకి 33.6 శాతం ఓట్లు వచ్చాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి 2018 వరకు బీజేపీ అధికారంలో ఉంది. ఈ కాలంలో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.