మహారాష్ట్రలో నామినేషన్ల పర్వం తుదిదశకు చేరుకుంది. మంగళవారం (అక్టోబర్ 29) సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ చాలా మంది ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసలైన పోటీ ఎవరెవరి మధ్య అనేది ఇవాళ తేలిపోతుంది. కోప్రి-పచ్‌పఖాడీ నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే నామినేషన్ దాఖలు చేశారు. షిండేపై ఉద్దవ్ వర్గం నుంచి కేదార్ డిఘే పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందే షిండే థానేలో భారీ రోడ్‌షో నిర్వహించారు.
ప్రత్యేక రథంపై వచ్చిన షిండే తన నామినేషన్ దాఖలు చేశారు. రథంపై దివంగత బాల్ ఠాక్రే , ప్రధాని మోదీ,అమిత్‌షా ఫోటోలతో పాటు తన రాజకీయ గురువు ఆనంద్ ఢిఘే ఫోటో పెట్టారు. షిండే నామినేషన్ కార్యక్రమానికి బీజేపీతో పాటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేతలు హాజరయ్యారు. షిండే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బారామతి అసెంబ్లీ స్థానం నుంచి డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ తన నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీ పడ్డారు. ఆ పోరులో సుప్రియా సూలే గెలుపొందారు. అజిత్ పవార్‌పై పోటీగా ఆయన తమ్ముడి కుమారుడు యుగేంద్ర పవార్ బరిలోకి దిగారు. దీంతో బారమతి నియోజకవర్గం మరోసారి కుటుంబ పోరుకు వేదికైంది. తన సోదరుడి కుమారుడిని పోటీకి దింపి కుటుంబంలో చిచ్చు పెట్టారని శరద్‌పవార్‌పై మండిపడ్డారు అజిత్‌పవార్.
మహారాష్ట్రలో ఇప్పటివరకు మహా వికాస్ అఘాడి కూటమి 259 మంది అభ్యర్ధులను ప్రకటించింది. మహాయుతి కూటమి 253 మంది అభ్యర్ధులను ప్రకటించింది. నామినేషన్ల చివరి రోజు వరకు రెండు కూటమిల్లో అభ్యర్ధుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..