AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!

Maha Kumbh Mela: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Indian Railways: మహా కుంభమేళాకు రూ.5 వేల కోట్లు.. 13 వేల ప్రత్యేక రైళ్లు..!
Prayagraj Maha Kumbh Mela
Janardhan Veluru
| Edited By: |

Updated on: Dec 31, 2024 | 12:00 PM

Share

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కోట్లాదిగా తరలివచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాదిగా మహా కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం భారత రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది. యాత్రికుల సౌకర్యార్థం దేశ నలుమూలల నుంచి 3,000 ప్రత్యేక రైళ్లు సహా మొత్తం 13 వేల రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ కుంభమేళాకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాగ్‌రాజ్ నగరానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేళా సన్నాహాల కోసం భారతీయ రైల్వే శాఖ గత రెండేళ్లలో రూ.5,000 కోట్లకుపైగా ఖర్చు చేసిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. కుంభ్‌మేళాకు సుమారు 3000 రైళ్లతో పాటు 560 రింగ్ రైళ్లను అదనంగా నడుపుతున్నట్టు నార్త్ సెంట్రల్ రైల్వేశాఖ ప్రకటించింది. ఈ 560 రైళ్లకు ప్రయాగ్‌రాజ్, సుబేదర్‌గంజ్, నైని, ప్రయాగ్‌రాజ్ చోకి మొదలగు తొమ్మిది రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకోవచ్చునన్నారు. ఆయా టికెట్ల కౌంటర్లలో ప్రతీ రోజూ సుమారు పది లక్షల టికెట్లు అమ్మకం జరుగుతోందన్నారు. అలాగే మహా కుంభ్‌మేళా సందర్భంగా అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లను 15 రోజులకు ముందుగానే బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇచ్చింది రైల్వేశాఖ. ప్రయాగ్‌రాజ్-అయోధ్య-వారణాసి-ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్-సంగం ప్రయాగ్-జౌన్‌పూర్-ప్రయాగ్-ప్రయాగ్‌రాజ్, గోవింద్‌పురి-ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్-గోవింద్‌పురి, ఝాన్సీ-గోవింద్‌పురి-కోత్రానీ రూట్లలో ఈ రింగ్ రైళ్లు నడవనున్నట్టు తెలిపారు.

మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ సన్నాహాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారంనాడు ప్రయాగ్‌రాజ్‌‌లో సమీక్షించారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలో గంగా నదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జ్‌ (Ganga Rail Bridge)ని పరిశీలించిన ఆయన.. ఈ బ్రిడ్జ్‌ని త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇక్కడ గంగానదిపై కొత్త బ్రిడ్జ్ నిర్మించినట్లు తెలిపారు. మహా కుంభమేళా సందర్భంగా తొలిసారిగా ప్రయాగ్ రాజ్‌లో మొబైల్ యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా 50 ప్రముఖ నగరాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రతి రోజూ రైళ్ల ద్వారా 20 లక్షల మంది యాత్రికులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటారని అంచనావేస్తున్నారు. 9 రైల్వే స్టేషన్ల ద్వారా యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించనున్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రయాగ్ రాజ్‌లో మాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.