Lotus in G20 logo: జీ-20 లోగోపై రాజకీయ రగడ.. కమలం గుర్తుపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ కౌంటర్..

|

Nov 10, 2022 | 5:50 AM

జీ-20 లోగోపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రధాని మోదీ విడుదల చేసిన లోగోలో కమలం గుర్తుపై కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అయితే కమలం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని , దీనిపై వివాదం అనవసరమని బీజేపీ కౌంటరిచ్చింది.

Lotus in G20 logo: జీ-20 లోగోపై రాజకీయ రగడ.. కమలం గుర్తుపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ కౌంటర్..
G20 Logo
Follow us on

భారత్‌లో వచ్చే ఏడాది జరిగే జీ-20 దేశాల సదస్సు లోగోను ప్రధాని మోదీ మంగళవారం విడుదల చేశారు. అయితే జీ-20 లోగోపై కమలం గుర్తు ఉండడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. జీ-20 లోగోను బీజేపీ ఎన్నికల గుర్తుగా ఎలా మారుస్తారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ జెండాపై కాంగ్రెస్‌ గుర్తును తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. బీజేపీ ఎన్నికల గుర్తు జీ-20 సదస్సుకు భారత్‌ నుంచి లోగోలా మారాడం విడ్డూరంగా ఉందంటూ జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా చేయడం తగదంటూ కాంగ్రెస్ నేత బీజేపీకి సూచించారు. స్వయంగా ప్రధాని మోడీ పార్టీ గుర్తును ప్రమోట్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌తో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఫోరమ్ G20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుంది. ఈ జీ20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. జీ-20 లోగో ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్‌ జీ-20 సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశ్వమంతా ఒకే కుటుంబం అన్న సందేశాన్ని ఈ సదస్సు ఇస్తుందన్నారు. కమలం భారత వారసత్వ సంపదకు చిహ్నమని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ తోపాటు జేడీయూ కూడా జీ-20 లోగోలో కమలం గుర్తును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే విపక్షాలు అనవసరంగా జీ-20 లోగోపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ కౌంటరిచ్చింది. కమలం జాతీయ పుష్పమని బీజేపీ నేత షెహజాద్‌ పూనావాలా పేర్కొన్నారు. కమల్‌నాథ్‌ పేరుతో కమల్‌ ఉందని ఆయన పేరు మారుస్తారా అంటూ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

జీ-20 లోగో కేవలం సింబల్‌ మాత్రమే కాదని , ఇది చక్కని సందేశాన్ని ఇస్తుందన్నారు మోదీ. వచ్చే ఏడాది భారత్‌లో జీ- 20 సదస్సు జరుగుతుంది. భారత్‌ అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయి. ఈ ఏడాది బాలిలో జీ -20 సదస్సు జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..