
లోక్‌సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. మొత్తానికి ఓ పనైపోయింది. రెండున్నర నెలలపాటు విరామం లేకుండా మోగిన మైకులు..మూగబోయాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డ నేతలు. ఎట్టకేలకు విశ్రమించారు. తుదిదశ పోలింగ్‌కు ప్రచార గడువు ముగియడంతో అగ్రనేతలు..ఆధ్యాత్మిక బాట పట్టారు. ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తుది దశ ఓటింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. మొత్తం 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో తుదిదశ పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి , ఇటు ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల తుది ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. శనివారం సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ జరుగుతుంది. తుది దశలో జూన్ 1వ తేదీన 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. 57 ఎంపీ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్‌లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ప్రధాని మోదీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి.. ఏడో దశలోనే ఓటింగ్ జరగనుంది. దీంతో వారణాసి ఓటర్లను ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు మోదీ. కాశీ నగరం భక్తి, శక్తి, విరక్తికి నిదర్శనమన్న మోదీ..జూన్ 1వ తేదీన కాశీ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు.
చివరి విడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై.. కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. అలాగే బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్‌వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్‌పూర్ నుంచి బీజేపీ తరఫున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరఫున సత్యపాల్ సింగ్ బరిలో ఉన్నారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక చివరివిడత బరిలో నిలిచిన 904 మందిలో 199 మందికి అంటే 22శాతం మందికి నేర చరిత్ర ఉందని చెబుతోంది..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక. కాగా, బెంగాల్‌లో ప్రతిసారి హింస చెలరేగడంతో ఈసారి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 9 స్థానాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమంటున్నారు ప్రధాని మోదీ. గెలుపుపై అటు ఎన్డీఏ కూటమి , ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ. తుది దశలో బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలకు, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్‌లో పోలింగ్ జరగనుంది.ప్రధాని మోదీతో సహా 598 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. యూపీ, బిహార్, జార్ఖండ్ , హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి , ఇండియా కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఒడిశా , పంజాబ్ , బెంగాల్‌లో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో తృణమూల్ పొత్తుపెట్టుకోలేదు. మార్చిలో తమిళనాడు లోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ పంజాబ్ లోని హోషియార్‌పూర్‌లో ముగించారు. 200 సభల్లో పాల్గొన్నారు. 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు. 75 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా మోదీ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఓటర్లకు వీడియో సందేశం ఇచ్చారు.
తుదివిడతలో ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆరు దశల్లో జరిగిన పోలింగ్‌లో ఎవరిది పైచేయి అన్న విషయంపై ఇప్పటికి క్లారిటీ రావడం లేదు. పార్టీలు హోరాహోరీగా భావిస్తున్న ఈ ఎన్నికలను..ప్రజలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గత ఆరు విడతల్లో నమోదైన పోలింగ్గే అందుకు నిదర్శనం. తొలి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71 శాతం, మూడో దశలో 65.68 శాతం, నాలుగో దశలో 69.16 శాతం, ఐదో దశలో 62.2 శాతం, ఆరో విడత పోలింగ్‌లో 61.98 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఇప్పటికే ఆరు దశల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీ.. ఇప్పుడు చివరి దశ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ..జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది.
శనివారం పోలింగ్ పూర్తి కాగానే వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి 400 సీట్లు ఖాయమని , ప్రధాని పగ్గాలను మోదీ మూడోసారి చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు చాలా తగ్గుతాయని విపక్షాలు చెబుతున్నాయి. బీజేపీ తరపున సుడిగాలి ప్రచారం చేశారు మోదీ. ఒక్కో దశలో ఒక్కో అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకాగాంధీ తమ భుజాలపై వేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…