UP Politics: సీఎం యోగిని కలిసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. !

లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు .

UP Politics: సీఎం యోగిని కలిసిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. !
Aparna Yadav Met Cm Yogi

Updated on: Mar 17, 2024 | 8:48 PM

లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో సమాజ్‌వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు . సీఎం యోగితో అపర్ణా యాదవ్‌ భేటీ తర్వాత యూపీలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. అపర్ణా యాదవ్ యూపీలోని ఏ స్థానం నుంచి అయినా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ మేరకు అపర్ణా యాదవ్ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ఎక్స్‌లో సీఎం యోగితో కలిసిన ఫోటోను కూడా పంచుకున్నారు. ఈ సమావేశాన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా అపర్ణా యాదవ్ అభివర్ణించారు. అయితే, సీఎం యోగి, అపర్ణా యాదవ్‌ల భేటీకి సంబంధించిన ఈ ఫోటో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు అపర్ణా యాదవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌ను సైతం కలిశారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అపర్ణా యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి, ఆమె ఎన్నికలలో పోటీ చేయడం గురించి చాలాసార్లు చర్చలు జరిగాయి. ఆ సమయంలో ఆమె లక్నో స్థానం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావించారు. అయితే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఇటీవల అపర్ణా యాదవ్ పేరు రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెరపైకి వచ్చింది. అయితే మరోసారి లోక్‌సభ ఎన్నికలకు అపర్ణా యాదవ్ పేరు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో అపర్ణా యాదవ్ భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా, యూపీలో బీజేపీ తన రెండో జాబితాలో 24 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఇందులో చాలా మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లు ముప్పు పొంచి ఉంది. యుపిలో మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. అదే సమయంలో, ఈ ఎన్నికలకు సంబంధించి యూపీలో మిషన్-80 కోసం బీజేపీ కింది స్థాయిలో సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా కూడా త్వరలో విడుదల కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..