Biggest Constituencies: అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలేమిటి..? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..?

|

May 11, 2024 | 7:42 PM

దేశంలోనే అత్యధిక ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గం ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో లేదండి.. మన తెలంగాణలోనే.. అదీ హైదరాబాద్‌లోనే ఉంది. ఆ నియోజకవర్గం మరేదో కాదు.. మన మల్కాజ్‌గిరి. ఈనియోజకవర్గంలో అన్ని రకాల ప్రాంతాల జనాభా నివసిస్తూ వైవిధ్యాన్ని కలిగిన ప్రాంతం.

Biggest Constituencies: అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలేమిటి..? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..?
Voting
Follow us on

ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఓ మహత్తర ఘట్టం. అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహించటం ఆషామాషీ వ్యవహారం కాదు..భారత ఎన్నికల సంఘం ప్రతి ఐదేళ్లకోసారి ఈ ప్రహసనాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తున్నది. తాజాగా 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అత్యధిక ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గాలేమిటో? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

దేశంలోనే అత్యధిక ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గం ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో లేదండి.. మన తెలంగాణలోనే.. అదీ హైదరాబాద్‌లోనే ఉన్నది. ఆ నియోజకవర్గం మరేదో కాదు.. మన మల్కాజ్‌గిరి. ఈనియోజకవర్గంలో అన్ని రకాల ప్రాంతాల జనాభా నివసిస్తూ వైవిధ్యాన్ని కలిగిన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో సుమారు 31 లక్షలకు పైగా ఓటర్లున్నారు. అందుకే అన్ని పార్టీలూ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.

మల్కాజ్‌ గిరి తర్వాత మరో పెద్ద నియోజకవర్గంగా ఢిల్లీలోని అవుటర్‌ ఢిల్లీ నిలుస్తుంది. సుమారు 25 లక్షల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ద్వారక, నజఫ్‌గఢ్‌, ముండ్కా లాంటి ప్రాంతాలు ఈ నియోజకవర్గం కింద ఉన్నాయి. అటు పట్టణ, ఇటు గ్రామీణ జనాభాను ఇక్కడ చూడవచ్చు. ఈ నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లోనూ అధిక ఓటింగ్‌ శాతాన్ని నమోదు చేస్తూ వస్తోంది.

నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో ఉన్న ఘజియాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఘజియాబాద్‌ వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రదేశం. ఇక్కడ సుమారు 23 లక్షల ఓటర్లున్నారు. అంతేగాక ఇక్కడ ఇండస్ట్ట్రియలైజేషన్‌ కూడా ఎక్కువే. అందుకే ఈ నియోజకవర్గ జనాభా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ఇక్కడ కూడా పట్టణ, గ్రామీణ ప్రజలు గణనీయంగా ఉన్నారు.

ఇండియాలోనే మేటి ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరులోనిది ఈ నియోజకవర్గం. సౌత్‌ బెంగళూరులో జయనగర్‌, బసవనగుడి, ఎలక్ట్రానిక్‌ సిట్‌ లాంటి మేజర్‌ ప్లేసెస్‌ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారు 20లక్షల ఓటర్లున్నారు. కర్ణాటక రాజకీయాలకు ఈ నియోజకవర్గం కేంద్రమని చెబుతారు. అంతేగాక దేశ రాజకీయాలను కూడా ఈ నియోజకవర్గం ప్రభావితం చేస్తుంది.

ముంబై నార్త్‌ నియోజకవర్గం.. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య సుమారు 18 లక్షలు ఉంటుంది. మలాడ్‌, కండివాలి, బోరివలి లాంటి ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. ఎలైట్‌ పీపుల్‌ నుండి డౌన్‌ట్రాడన్‌ జనాభాకు ఈ నియోజకవర్గం నిలయం. ఇండియా ఆర్థిక స్థితిని తెలియచేసే నమూనా లాంటి ఈ నియోజకవర్గం దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైనది.

దేశ రాజధానిలో అవుటర్‌ ఢిల్లీ తర్వాత అత్యధిక ఓటర్లున్న మరో ప్రాంతం నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ. ఈ నియోజకవర్గం పరిధిలో సహదారా, సీలంపూర్‌, యుమునా విహార్‌ తదితర ప్రాంతాలున్నాయి. వివిధ రకాల నేపథ్యాలున్న ఓటర్లు ఇక్కడ నివసిస్తుంటారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల సంఖ్య సుమారు 17 లక్షలు

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాలు దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉన్నాయి. వాటిలో ఒకటి చాందినీ చౌక్‌ నియోజకవర్గం. పాత ఢిల్లీతో పాటు దర్యాగంజ్‌, చాందినీ చౌక్‌ తదితర ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 16 లక్షల ఓటర్లున్నారు.

వాయువ్య ఢిల్లీ నియోజకవర్గంలో రోహిణి, నరేలా, కిరారి లాంటి ప్రాంతాలున్నాయి. చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక వైపు విశాలమైన పట్టణ ప్రాంతముంటుంది. మరోవైపు గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఢిల్లీలోని అత్యధికులు ఈ నియోజకవర్గంలోనే నివసిస్తుంటారు. ఇక్కడ నివసిస్తున్న ఓటర్ల సంఖ్య సుమారు 15లక్షలు.

కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురంలో జనాభాకు రాజకీయంగా ఎంతో అవగాహన ఉంది. ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. రాష్ట్ర కల్చరల్‌ సెంటర్‌గా కూడా దీనికి ప్రాముఖ్యమున్నది. ఇక్కడి ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంటారు. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య సుమారు 14 లక్షలు.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా పుణె చాలా ఫేమస్‌. శివాజీనగర్‌, కోత్రుడ్‌, హడప్పర్‌ లాంటి పేరున్న ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. విద్యావంతులైన ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గమిది. ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారు 13 లక్షలు

దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌.. ఆ రాష్ట్రానికి రాజధాని ప్రాంతమే లక్నో.. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుంటారు. హజ్రత్‌గంజ్‌, అలంబాగ్‌, గోమతి నగర్‌ తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓటర్లు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు.

కేవలం అత్యధిక ఓటర్ల పరంగానే గాక దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గాల ప్రభావం చాలా ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఈ నియోజకవర్గాలపై అందరూ ప్రత్యేక దృష్టి పెడతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…