జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 13 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రాంబన్-సంకల్దాన్ గుల్ రహదారి పైభాగంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బాధిత కుటుంబాలన్నింటినీ ఆ ప్రాంతం నుంచి తాత్కాలిక నివాసాలకు తరలించారు రెస్క్యూ బృందాలు. విపత్తు బాధితులకు సైన్యం ఆహారం, ప్రాథమిక సౌకర్యాలను అందించినట్టుగా అధికారులు తెలిపారు. 33కేవీ విద్యుత్ లైన్లు, ప్రధాన నీటి పైపులైన్ల పైన కొండచరియలు విరిగిపడటంతో పెను ప్రమాదం ఏర్పడింది.. కొండచరియలు విరిగిపడటానికి కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు.
కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను పరిశోధించడానికి జియాలజీ, గనుల శాఖకు చెందిన జియాలజిస్టుల బృందాన్ని పంపాలని జిల్లా కలెక్టర్ జమ్ము డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడటంతో రాంబన్-సంకల్దాన్ గూల్ రహదారికి అంతరాయం ఏర్పడింది.
మరోవైపు, గుల్ తహసీల్‌లోని ప్రధాన కార్యాలయానికి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేసేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్ అధికారిని రాంబన్ డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. విపత్తు బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలను సైన్యం అందజేస్తుందని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..