Video: తమ నాయకుడి బర్త్‌డేను పడవలో వెరైటీగా ప్లాన్ చేశాడు..! కానీ ఊహించని విధంగా..
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 78వ పుట్టినరోజు వేడుకల్లో వైశాలి జిల్లా ఆర్జేడీ నాయకుడు కేదార్ యాదవ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. చెరువులో పడవలో కేక్ కట్ చేయాలనుకున్న కేదార్, పడవ అదుపుతప్పడంతో నీటిలో పడ్డాడు. అయితే, ప్రమాదం తప్పినా కేక్ నీటిలో మునిగిపోయింది.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 78వ పుట్టిన రోజు సందర్భంగా బిహార్ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరిపారు. అయితే వైశాలి జిల్లాలో ఆర్జేడీ నాయకుడు ఒకరు లాలూ పుట్టినరోజు వేడుకలను చాలా వెరైటీగా ప్లాన్ చేశాడు. కానీ, అనూహ్యంగా ఆయన ప్లాన్ అంతా ఉల్టా అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆర్జేడీ నాయకుడు కేదార్ యాదవ్ భగవాన్‌పూర్ బ్లాక్‌లోని కిరాత్‌పూర్ రాజారాం గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ చెరువు నీటిలో ఒక పడవను ఏర్పాటు చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు, కేదార్ యాదవ్ ఆ పడవ ఎక్కారు. పడవపై ఒక కుర్చీ, దానిపై ఒక కేక్ కూడా ఉంచారు.
ఆర్జేడీ నాయకుడు కేదార్ యాదవ్ కేక్ కట్ చేయడానికి ప్రయత్నించగా పడవ పక్కకు ఒరిగింది. అంతే కేక్‌తో పాటు కేదార్ కూడా నీటిలో పడిపోయారు. అదృష్టవశాత్తూ నీరు తక్కువగా ఉండటంతో కేదార్ ప్రాణాలతో బయటపడ్డారు. కేక్ నీటిలో పడిపోవడంతో మరొక కేక్ కట్ చేసి, ఆర్జేడీ కార్యకర్తలు తమ ప్రియమైన నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే గతంలో కూడా కేదార్ యాదవ్ చాలా వినూత్నంగా తమ అధినేత పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. వెరైటీగా లాలూ బర్త్‌డే వేడుకలు చేస్తారని కేదార్‌కు పేరుంది. JCBపై కూర్చుని, ఒకసారి గేదెపై కూర్చుని కేదార్ కేక్ కట్ చేశారు. అలాగే ఒకసారి తేజస్వి యాదవ్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నప్పుడు, కేదార్ భగవాన్‌పూర్ NH-22 వెంబడి రోడ్డుపై పూజలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..