Coronavirus: దేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజులో ఎన్ని నమోదయ్యాయంటే
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల్లోనే ఏడు వేలు దాటడం కలవరపాటుకు గురిచేస్తోంది. అటు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీని కలవాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి చేసింది పీఎంవో. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు భయపెడుతున్నాయి. ఇటీవల కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత.. కొద్దిరోజుల్లోనే కేసుల సంఖ్య 7 వేలు దాటాయి. 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 7,121 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనాతో 74 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రధానంగా.. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే 2వేల 223 కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే.. ఏపీలో 72, తెలంగాణలో 11 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
అయితే.. కరోనా కొత్త వేరియంట్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందస్తు జాగ్రత్తలతో అలెర్ట్‌గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మరోవైపు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీఎంవో అలెర్ట్ అయింది. ప్రధాని మోదీని కలవాలంటే RT-PCR టెస్టులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చే నేతలు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించింది. పీఎంవో ఆదేశాలతో సుమారు 70మంది ఢిల్లీ బీజేపీ నేతలు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని పురష్కరించుకుని ఢిల్లీ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే.. ఢిల్లీ సీఎం రేఖ గుప్తాతోపాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్టీపీసీఆర్ టెస్టులకు వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు వెళ్లి వచ్చిన అఖిలపక్ష ప్రతినిధుల బృందాల సభ్యులు కూడా ప్రధాని మోదీతో భేటీ ముందు కరోనా టెస్టులు చేయించుకున్నారు.