MCD Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలో స్ట్రీట్‌ ఫైట్‌.. సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేజ్రీవాల్..

|

Jan 07, 2023 | 6:52 AM

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన రచ్చపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేజ్రీవాల్‌. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతకీ, కేజ్రీవాల్‌ చేస్తోన్న ఆరోపణలు ఏంటి?. మేయర్‌ ఎన్నికలో రచ్చకు అసలు కారణమేంటి?

MCD Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలో స్ట్రీట్‌ ఫైట్‌.. సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేజ్రీవాల్..
Delhi Mcd Mayor Poll
Follow us on

ఢిల్లీ మేయర్‌ ఎన్నికలో హైడ్రామాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన మొత్తం ఎపిసోడ్‌పై అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేలా టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు. నామినేటెట్‌ సభ్యుల నియామకం దగ్గర్నుంచి, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అపాయింట్‌మెంట్ వరకు.. ప్రతి నిర్ణయంలోనూ కుట్ర ఉందన్నారు. సీనియర్ మోస్ట్‌ కార్పొరేటర్‌ ముఖేష్‌ గోయల్‌ను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఆప్‌ ప్రతిపాదిస్తే, బీజేపీ కార్పొరేటర్‌ సత్యశర్మను నియమించడం ఏమిటని నిలదీశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు ఢిల్లీ సీఎం. ఎల్జీ సక్సేనా.. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, మేయర్‌ ఎన్నికను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

మేయర్‌ ఎన్నిక సందర్భంగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ, ఆప్‌ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ జరిగింది. వీధి రౌడీల్లా ఒకరినొకరు కుమ్మేసుకున్నారు. ఏదో సినిమా సీన్‌ తరహాలో దొమ్మీకి దిగారు. కార్పొరేటర్లు కొట్లాటతో రణరంగాన్ని తలపించింది ఢిల్లీ కార్పొరేషన్‌ మీటింగ్‌ హాల్‌. ముందుగా నామినేటెడ్‌ సభ్యులతో ప్రమాణం చేయించడంతో గొడవకు దిగింది ఆప్‌. ఎన్నికైన కార్పొరేటర్లతో కాకుండా నామినేటెడ్‌ సభ్యులతో ప్రమాణం చేయించడం ఏంటంటూ పోడియంను చుట్టుముట్టింది. ఆమ్‌ ఆద్మీ సభ్యులకు కౌంటర్‌గా బీజేపీ సైతం ఆందోళనకు దిగడంతో అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది మీటింగ్‌ హాల్‌. కుర్చీలు విసురుకుంటూ, ఒకరినొకరు తోసుకుంటూ చితక్కొట్టుకున్నారు కార్పొరేటర్లు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది ఆప్‌. 15ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్‌ను ఏలుతోన్న బీజేపీని మట్టికరిపించి 134 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కూడా 104 సీట్లు గెలుచుకుని ఆమ్‌ ఆద్మీకి దగ్గర్లో నిలిచింది. అయితే, ఇక్కడే రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆప్‌కి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, పోటీకి దిగింది బీజేపీ. దాంతో, బీజేపీ-ఆప్‌ మధ్య రగడ జరుగుతోంది. మేయర్ పదవి కోసం ఆప్‌ తరపున షెల్లీ ఒబెరాయ్‌ ఉండగా.. బీజేపీ నుంచి రేఖాగుప్తా బరిలోకి దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..