కోటా, మే 9: ఉన్నత చదువులు చదివి, తమ కన్నా ఎంతో ఎత్తు ఎదుగుతారని ఎన్నో ఆశలతో తమ పిల్లలను కోచింగ్ హబ్‌గా పేరు గాంచిన కోటాకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే అక్కడ వివిధ కోచింగ్ సెంటర్లలో క్లాస్‌లకు హాజరవుతున్న విద్యార్ధులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక.. అటు ఇంటికి వెళ్లలేక.. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు, అదృశ్యాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. చదువుల ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తనువులు చాలిస్తున్నారు. తాజాగా అక్కడ చదువుతోన్న మరో విద్యార్థి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ఐదేళ్ల పాటు ఇంటి రానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి మరీ చదువుకు దూరంగా పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గంగారాంపూర్‌లోని బమన్‌శాస్‌కు చెందిన రాజేంద్ర మీనా (19) అనే విద్యార్ధి కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష ‘నీట్’కు సిద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ క్లాస్‌లకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో మే 6వ తేదీన అతడు అదృశ్యమయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోటాలో తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ వసతి గృహం ఖాళీ చేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోయేముందు రాజేంద్ర మీనా తన తండ్రి జగదీశ్ మీనాకు ఫోన్‌లో ఓ మెసేజ్ పంపాడు. ‘నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నా చదువును కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నా వద్ద రూ.8 వేలు ఉన్నాయి. ఐదేళ్లకు సరిపోతుంది. నా ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. సిమ్‌ను విరిచేస్తున్నాను. నా గురించి చింతించొద్దని అమ్మకు చెప్పండి. నేను ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోను. మీ అందరి నంబర్లూ నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఫోన్ చేస్తా’ తన తండ్రికి మెసేజ్ పంపాడు.
కుమారుడి నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసి తల్లిదండ్రులు పరుగుపరుగున పోలీసుల వద్దకు చేరుకుని తమ కుమారుడు రాజేంద్ర మీనా మిస్సింగ్ విషయం వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధి అచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కోటా పోటీ కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఈ సంఘటన అద్దం పడుతోంది. ఇప్పటికే ఎంతో మంది విద్యార్ధులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అక్కడి నుంచి పారిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.