AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా నగరంలోని హోటల్‌లో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. బీర్భూమ్‌ జిల్లాలోని తారాపీఠ్‌లో సోమవారం జరిగిన మరో హోటల్ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు
Fire Accident
Rajashekher G
|

Updated on: Aug 19, 2026 | 9:42 AM

Share

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. న్యూ మార్కెట్‌ సమీపంలోని ఫ్రీ స్కూల్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ హోటల్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశ్‌ పౌరులేనని అధికారులు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం వారు కోల్‌కతాకు వచ్చినట్లు సమాచారం.

మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్‌లోని పలువురు అతిథులు భవనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి హోటల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.

హోటల్‌లో దట్టమైన పొగ అలుముకోవడంతో పై అంతస్తులకు చేరుకోవడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారిందని పోలీసులు తెలిపారు. తొమ్మిది మంది మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ ప్రస్తుతం కూలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీ పేలడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

రెండు రోజుల క్రితమే మరో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా హోటల్‌ అగ్నిప్రమాదానికి కేవలం రెండు రోజుల ముందే పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 17న తెల్లవారుజామున తారాపీఠ్‌లోని బిదేషిని హోటల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐదు అంతస్తుల ఈ హోటల్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉదయం 4:30 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. ఘటన సమయంలో ఎక్కువ మంది అతిథులు నిద్రలో ఉన్నారు. తారాపీఠ్‌ ఆలయానికి సమీపంలోని పవిత్ర చెరువు పక్కనే ఈ హోటల్‌ ఉంది.

ఈ ప్రమాదంలో మేఘాలయకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు, ఇద్దరు చిన్నారులతో సహా, ప్రాణాలు కోల్పోయారు. వారు హోటల్‌ పై అంతస్తులో బస చేస్తున్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన విషయం గుర్తించిన తర్వాత పిల్లలతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, మెట్లు దిగుతున్న సమయంలో మంటలు వారిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి చికిత్స కోసం రాంపూర్‌హాట్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు తరలించారు. వరుసగా చోటుచేసుకుంటున్న హోటల్‌ అగ్నిప్రమాద ఘటనలు పశ్చిమ బెంగాల్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us