Kolkata Doctor Muder Case: ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పాలీగ్రాఫ్‌ టెస్టులో నిందితుడు ఏం చెప్పాడంటే

|

Aug 26, 2024 | 2:48 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా అతడికి ఇటీవల పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇదే జైల్లో లై డిటెక్టర్‌ పరీక్ష చేయగా.. అన్నీ పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం తాను..

Kolkata Doctor Muder Case: ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పాలీగ్రాఫ్‌ టెస్టులో నిందితుడు ఏం చెప్పాడంటే
Kolkata Doctor Muder Case
Follow us on

కోల్‌కతా, ఆగస్టు 26: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా అతడికి ఇటీవల పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇదే జైల్లో లై డిటెక్టర్‌ పరీక్ష చేయగా.. అన్నీ పొంతనలేని సమాధానం చెప్పినట్లు సమాచారం తాను ఫెసిలిటీ సెమినార్ హాల్‌కు చేరుకున్నప్పుడు బాధితురాలు అప్పటికే మృతి చెంది ఉందని, భయంతో అక్కడి నుంచి పారిపోయానని లై డిటెక్టర్ పరీక్షలో పేర్కొన్నాడు. అంతేకాక అత్యాచారం, హత్య కేసులో తాను నిర్దోషినని పాలిగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. లై డిటెక్టర్ పరీక్షలో ఇదే విధంగా తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలను అనేకం చెప్పాడు. ఈ పరీక్ష చేసేటప్పుడు సంజయ్ రాయ్ నిరుత్సాహంగా, ఆందోళనగా కనిపించాడని, కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

మరోవైపు కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఆగస్టు 9న వెలుగు చూసిన వైద్యురాలి హత్యాచార కేసులో.. ఆ మరుసటి రోజే కోల్‌కతా పోలీసులు సంజయ్‌ రాయ్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు అత్యాచారం ,హత్య చేసినట్లు సంజయ్‌ రాయ్‌ నేరం అంగీకరించాడు. ఘటన సమయంలో ప్రతీ నిమిషం చోటుచేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే కన్పించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న సీబీఐ అధికారులు చెప్పారు. అయితే తాజాగా తనను ఇరికించారని, నిర్దోషినని కన్నీటి పర్యాంతం అవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా గత వారం శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) కోర్టు ముందు కూడా ఇవే మాటలు చెప్పాడు. అంతేకాకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి లై డిటెక్ట్‌ పరీక్షకు కూడా సమ్మతిస్తున్నట్లు చెప్పాడు.

ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కోర్టు ఆదేశాలతో నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమయంలో సంజయ్‌ పరిశోధకులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని, నేరం జరిగినప్పుడు ఆస్పత్రిలో ఉన్న అతని ముఖానికి గాయాలు ఎలా తగిలాయో చెప్పమని అడిగినప్పుడు మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేనని ఓ అధికారి తెలిపారు. అందుకే అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో మహిళ శవమై కనిపించిన వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో లైంగిక వేధింపులు, ఆమె శరీరంపై ప్రైవేట్ భాగాలతో సహా 25 గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆగస్ట్ 9 తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్‌లోకి వెళ్లడాన్ని పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో చూశారు. నేరస్థలంలో అతని బ్లూటూత్ హెడ్‌సెట్‌ను కూడా కనుగొన్నారు. ఇక సంజయ్ రాయ్ మానసిక విశ్లేషణ ప్రొఫైలింగ్ పరీక్షించగా.. అతడు పోర్నోగ్రఫీకి విపరీతంగా బానిసైనట్లు వెల్లడించింది. అతడిలో జంతు ప్రవృత్తి ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.