కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు హోరాహోరి ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. తుది దశ ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ వాచ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్న వారిలో నేరచరితులు పెరిగారంటూ వెల్లడించింది. కర్ణాటకలో గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలలో నేర చరితులు పెరిగారంటూ ఏడీఆర్ నివేదికలో తెలిపింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. పోటీచేస్తున్న అభ్యర్థుల్లో.. కాంగ్రెస్ పార్టీకి 31 శాతం, బీజేపీకి 30 శాతం, జేడీఎస్‌కు 25 శాతం మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
బీజేపీలో గత ఎన్నికల్లో 83 మంది నేరచరిత్ర అభ్యర్థులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 93కు చేరుకుంది. కాంగ్రెస్‌లో గతంలో 59 మంది, ఈ ఎన్నికల్లో 122 మంది ఉన్నారు. జేడీఎస్‌లో గతంలో 41 మంది ఉన్న అభ్యర్థులు, ఈ సారి 70 మంది అయ్యారు. ఆప్ అభ్యర్థుల్లో 30 మంది నేరచరితులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మొత్తంగా ఎనిమిది మందిపై హత్యనేరం, 35 మందిపై హత్యయత్నం నేరం, 49 మందిపై మహిళలకు వ్యతిరేకరంగా నేరాల ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద 404 అభ్యర్థులకు నేర చరిత్ర ఉందని ఏడీఆర్ సర్వే ప్రకటించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల నేర చరిత్రతోపాటు ఆర్థిక, విద్యార్హత, లింగం, ఇతర వివరాలను ADR పంచుకుంటుంది. అయితే, పోటీ చేసే మహిళల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది. కాగా, 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..