Karnataka CM: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. అసలు కారణం ఇదే.. కొత్త సీఎం ఎవరంటే..?

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. దీంతో మూడేళ్ల సిద్ధరామయ్య ప్రభుత్వానికి తెరపడగా.. కొత్త ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. శుక్రవారం సీఎల్పీ భేటీ జరగనుంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్నారు.

Karnataka CM: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. అసలు కారణం ఇదే.. కొత్త సీఎం ఎవరంటే..?
Karnataka Cm Siddaramaiah Resigns

Updated on: May 28, 2026 | 3:20 PM

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. గత కొంతకాలంగా ఊగిసలాడుతున్న నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. దీంతో మూడేళ్ల సిద్ధరామయ్య ప్రభుత్వానికి తెరపడగా.. కొత్త ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. శుక్రవారం సీఎల్పీ భేటీ జరగనుంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకోనున్నారు. ఇవాళ  సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలను కలవనున్నారు. గురువారం ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాబినెట్ సహచరులతో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కాస్తా ఆయన వీడ్కోలు సమావేశంగా మారిపోయింది. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో కాబోయే సీఎం డీకే శివకుమార్‌తో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, రాష్ట్ర పగ్గాలను డీకే శివకుమార్‌కు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ తనను కోరినట్లు సిద్ధరామయ్య భావోద్వేగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్.. సిద్ధరామయ్యను హత్తుకుని, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం.

రాహుల్ గాంధీ సందేశంతోనే..

మంగళవారం కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాలతో జరిగిన వరుస సమావేశాల్లోనే ఈ అధికార మార్పిడి ఫార్ములా ఖరారైంది. రాహుల్ గాంధీ నుంచి నేరుగా సందేశం రావడంతోనే సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాహుల్ గాంధీ చెబితే తాను నిమిషాల్లో పదవి నుంచి తప్పుకుంటానని సిద్ధరామయ్య పదేపదే ప్రకటించారు. అధిష్టానానికి ఇచ్చిన మాట ప్రకారమే ఆయన ఇప్పుడు గౌరవప్రదంగా తప్పుకుంటున్నారు.

మద్ధతుదారుల ఆందోళన

ఒకవైపు అధికార మార్పిడి ప్రశాంతంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిద్ధరామయ్య అభిమానులు, మద్దతుదారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం బయట పెద్ద ఎత్తున మద్దతుదారులు గుమిగూడి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగాలని, ఆయనను మార్చవద్దంటూ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

సిద్ధరామయ్యకు హైకమాండ్ ఆఫర్..?

రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా మార్గం సుగమం చేసినందుకు గానూ సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను కాంగ్రెస్ ఆఫర్ చేసింది. కేంద్రంలో పార్టీ వ్యవహారాల్లో అగ్రతాంబూలంతో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై సిద్ధరామయ్య తుది నిర్ణయాన్ని ఇంకా హోల్డ్‌లో పెట్టారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Follow Us