NEETలో ఫెయిల్.. IT, IIMలేవ్.. కానీ రూ.కోటి జీతంతో రోల్స్ రాయిస్‌లో జాబ్.. ఓ అమ్మాయి సక్సెస్ స్టోరీ
ఒక వైఫల్యం అంతిమం కాదని, కృషి ఉంటే విజయాన్ని అందుకోవచ్చని ఈ అమ్మాయి కథ చెబుతుంది. నీట్ లో ర్యాంకు రాకపోవడంతో మెడికల్ సీటు కోల్పోయిన కర్ణాటక యువతి రితుపర్ణ కేఎస్ తన జీవితాన్ని కొత్త దిశగా మలుచుకుని అరుదైన విజయాన్ని అందుకుంది..

జీవితంలో ఒక పరీక్షలో విఫలమైతే అంతా అయిపోయిందని భావించే వారికి కర్ణాటకకు చెందిన రితుపర్ణ కేఎస్ కథ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు నీట్ (NEET) పరీక్షలో ఆశించిన ఫలితం సాధించలేక వైద్య విద్యకు దూరమైన ఆమె.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ సంస్థ రోల్స్ రాయిస్‌లో ఏకంగా రూ.72.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని దక్కించుకుంది. కర్ణాటకలోని తీర్థహళ్లి ప్రాంతంలోని కొడూరు గ్రామానికి చెందిన రితుపర్ణ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచింది. సెయింట్ అగ్నెస్ పాఠశాలలో చదివిన ఆమె వైద్యురాలిగా మారాలని కలలు కనేది. ప్రీ-యూనివర్సిటీ విద్య పూర్తయ్యాక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించాలనే లక్ష్యంతో నీట్‌కు సిద్ధమైంది. అయితే ఆశించిన ర్యాంకు రాకపోవడంతో ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయింది.
ఆ తర్వాత 2022 సీఈటీ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ కోటా సీటుతో సహ్యాద్రి కాలేజీలో ఇంజినీరింగ్‌లో చేరింది. మొదట్లో నిరాశ చెందినా, అక్కడే ఆగిపోకుండా తన ఆసక్తులను కొత్త దిశగా మలిచింది. కాలేజీలో చేరిన మొదటి రోజుల నుంచే కొత్త ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. అలా ఆమెకు రోబోటిక్స్‌పై ఆసక్తి పెరిగింది. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో తన సహచరులతో కలిసి ఆటోమేటెడ్ రోబోటిక్ వ్యవస్థను రూపొందించింది. ఈ సాంకేతికత ద్వారా అరెకనట్ (పోక) తోటల్లో కోత పనులు, పురుగుమందుల పిచికారీ వంటి పనులను సులభతరం చేయాలనే ప్రయత్నం చేసింది. ఈ ప్రాజెక్టును గోవాలో నిర్వహించిన INEX పోటీల్లో ప్రదర్శించగా, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ఆవిష్కరణకు బంగారు, వెండి పతకాలు లభించాయి. దీంతో రితుపర్ణ ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. తర్వాత ఆమె పరిశోధనల వైపు అడుగులు వేసి, ఎన్‌ఐటీకే సూరత్‌కల్ పరిశోధనా బృందంలో చేరింది. అక్కడ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధనలు చేసింది.
Meet Rithuparna KS. She once dreamed of becoming a doctor, but after failing to secure a government medical seat through NEET, she had to change course. Today, at just 20, she holds a ₹72.3 LPA offer from Rolls-Royce🔥
Born in Karnataka, she chose Robotics & Automation at… pic.twitter.com/ilaBba0seY
— Vikas Alwys (@VikasAlwys) June 22, 2026
ఇదే సమయంలో రోల్స్ రాయిస్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలుత తిరస్కరణ ఎదురైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నించింది. ఒక ప్రాజెక్టును కేవలం నెల రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసి సంస్థ దృష్టిని ఆకర్షించింది. ఆమె పట్టుదలను మెచ్చిన రోల్స్ రాయిస్ మరిన్ని ప్రాజెక్టులు అప్పగించింది. ఎనిమిది నెలల పాటు చదువుతో పాటు పలు ప్రాజెక్టులు పూర్తి చేస్తూ అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రితుపర్ణకు చివరికి 2024 డిసెంబర్‌లో రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలో ఉద్యోగ అవకాశం లభించింది. ప్రారంభంలో రూ.39 లక్షల వార్షిక వేతనం ప్రకటించిన సంస్థ, ఆమె ప్రతిభను గుర్తించి 2025 ఏప్రిల్‌లో జీతాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది. ఒక వైఫల్యం జీవితాన్ని నిర్ణయించదని, పట్టుదల, కృషి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే ధైర్యం ఉంటే అసాధ్యాలను కూడా సాధ్యం చేయవచ్చని రితుపర్ణ కేఎస్ విజయగాథ మరోసారి నిరూపించింది.




