BS Yediyurappa meets PM Narendra Modi: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో కొన్ని రోజుల నుంచి అసమ్మతి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కొంతకాలం నుంచి నాయకత్వ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీ ఆకస్మిక పర్యటన దీనికి మరింత ఊతమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే.. పార్టీ నాయకత్వ మార్పుపై చర్చించేందుకే అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటి అనంతరం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు గురించి తనకేమీ తెలియదంటూ యడియూరప్ప పేర్కొన్నారు. దీనికి సంబంధించి మీరే చెప్పాలంటూ పాత్రికేయులతో పేర్కొన్నారు. అయితే.. హుటాహుటిన యడియూరప్ప ఢిల్లీ వెల్లడంతో.. నాయకత్వ మార్పు జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇదిలాఉంటే.. సీఎం యడియూరప్పపై కర్ణాటక బీజేపీలో అసమ్మతి పెరుగుతుండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్ సింగ్ ఇటీవల పర్యటించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మార్చాలంటూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్ చేశారు. పార్టీలో యడియూరప్ప తనయుడి జోక్యం కూడా ఎక్కువైందంటూ పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ వెళ్లడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
Also Read: