kanwar yatra suspended Uttarakhand: దేశంలో కరోనాసెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా జనసమూహాలను నియంత్రించాలని.. దీని ద్వారా కరోనా వ్యాప్తికి నియంత్రించవచ్చని పేర్కొంటున్నాయి. అయితే ఈ క్రమంలో పలు యాత్రలు, జనసమూహా ప్రాంతాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఉత్తరఖాండ్ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్రపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కన్వార్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గురువారం ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యం అని ధామి పేర్కొన్నారు. దానికి తగినట్లుగానే నడుచుకుంటామని స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో కన్వర్ యాత్రను నిలిపేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు.
కొన్ని రోజుల నుంచి కన్వర్ యాత్ర అనుమతి విషయం చర్చనీయాంశంగా మారింది. కరోనా నిబంధనలతో భక్తులను అనుమతిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో పుష్కర్ సింగ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రం కేవలం వేదిక మాత్రమేనని.. యూపీ, మధ్యప్రదేశ్, హర్యానాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హరిద్వార్‌కు వస్తారన్నారు. ఆ రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. చాలా మంది విశ్వాసానికి సంబంధించిన అంశమైనప్పటికీ.. ప్రజల జీవితాలను చిక్కుల్లోకి నెట్టేయంలేమంటూ ధామీ అభిప్రాయపడ్డారు. ప్రజల జీవితాలను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. యాత్ర సందర్భంగా కోవిడ్ కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా భగవంతుడు క్షమించడంటూ సీఎం ధామి వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో హరిద్వార్ ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. హరిద్వార్‌కు భక్తులు ఎవరూ రావొద్దని.. ఒకవేళ వస్తే 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తామని హరిద్వార్ పోలీసులు తెలిపారు. అయితే కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్ రద్దు చసినప్పటికీ.. యూపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో శివ భక్తులు గంగా నది నీటిని తీసుకొని వెళ్లి భగవంతుడికి జలాభిషేకం చేస్తారు.
Also Read: