Justice NV Ramana: ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం.. 48వ సీజేఐగా బాధ్యతల స్వీకరణ

|

Apr 24, 2021 | 6:58 AM

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

Justice NV Ramana: ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం.. 48వ సీజేఐగా బాధ్యతల స్వీకరణ
Justice NV Ramana
Follow us on

Justice NV Ramana Oath Ceremony: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టులో సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ రమణ.. భారత 48వ సీజేఐగా ప్రమాణం చేయనున్నారు. దీంతో సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ రమణ నిలువనున్నారు. ఇంతకుముందు జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు సీజేఐగా వ్యవహరించారు. కాగా, 26 ఆగస్టు 2022 వరకు జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

దేశంలో కొవిడ్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరుగనున్న సీజేఐ జస్టిస్‌ రమణ ప్రమాణస్వీకారానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రమాణం అనంతరం సీనియర్‌ న్యాయవాదులు ఏర్పాటు చేసే విందు కూడా వాయిదా పడే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇప్పటికే కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్టు.. ఆ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారే కార్యక్రమానికి హాజరవుతారని అధికారి ఒకరు తెలిపారు. ఆనవాయితీ ప్రకారం.. ప్రమాణం అనంతరం సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లోని కోర్టు రూమ్‌ 1లో తొలి కేసును కొత్త సీజేఐ విచారిస్తారు.

సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీకాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వర్చువల్‌ మాధ్యమంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జస్టిస్‌ రమణ మాట్లాడారు. సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని, ఆయనతో అనుబంధాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ అన్నారు. జస్టిస్‌ బోబ్డేలోని తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆయనకు వైవిధ్యమైన అభిరుచులు ఉన్నాయని, ఆయుకు వీడ్కోలు పలుకడం అనేది చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు జస్టిస్‌ రమణ. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే ఈ-కోర్టులను ప్రారంభించడం ఆయన గొప్పతనమని రమణ తెలిపారు. మహమ్మారి సంక్షోభంలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు జస్టిస్‌ బోబ్డే కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో కరోనా పరిస్థితులను జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కొన్ని బలమైన చర్యలను తీసుకోవాల్సిన అవసరమున్నదని ఎన్వీ రమణ అన్నారు. ప్రస్తుతం దేశమంతా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నదన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణతోనే కరోనా ఓటమి సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బోబ్డే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణకు బాధ్యతలు అప్పగిస్తున్నానని, ఆయన సమర్థంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైరస్‌కు ఎలాంటి బేధభావాలు ఉండవని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా మహమ్మారి బారిన పడ్డారని గుర్తుచేశారు. అందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసర సేవలకు ఆటంకం కలుగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also…  ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..