ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ నానాటికీ కుంగి పోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఇళ్లకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకర పరిస్థితి నెలకొనడంతో ఆ ప్రాంత నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పగుళ్లు ఏర్పడిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేస్తామని జోషిమఠ్ అధికారులు మంగళవారం (జనవరి 10) ప్రకటించారు. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI)కి చెందిన నిపుణుల బృందం పర్యవేక్షణలో ఇళ్ల కూల్చివేత జరుగుతుందని పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంకు చెందిన ప్రత్యేక బృందం కూల్చివేత పనుల్లో సహాయం అందించనున్నట్లు తెల్పింది. ఇళ్లను కూల్చివేసే ప్రాంతాలను ‘అన్ సేఫ్ జోన్’లుగా ప్రకటించిన తర్వాత ఆయా కుటుంబాలను (4 వేల మందిని) సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే స్థానికులు మాత్రం తమ ఇళ్లను కూల్చవద్దని పెద్దపెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) అధికారులు కూడా సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామినిని ఆయన నివాసంలో కలుసుకుని సహాయక చర్యలపై చర్చించారు. జోషిమఠ్ ప్రాంతం భౌగోళిక స్థితి, కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరోవైపు జోషిమత్ ప్రాంత పరిస్థితిపై తాజా బులెటిన్‌ను విడుదల చేసింది. దాదాపు 678 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భద్రత దృష్ట్యా 81 కుటుంబాలను ఇప్పటికే తరలించారు. 213 ఇళ్లు నివాసయోగ్యమైనవిగా తాత్కాలికంగా గుర్తించారు. జోషిమత్ ప్రాంతం వెలుపల ఉన్న పిపాల్‌కోటిలో 491 ఇళ్లు/హోటళ్లు సురక్షితంగా ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొంది. బాధిత కుటుంబాలకు 63 ఆహార కిట్లు, 53 దుప్పట్లు పంపిణీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.