జమ్మూ కాశ్మీర్ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన తెలుగు ఆఫీసర్ కీ రోల్

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల భగ్నమైన ఉగ్ర కుట్ర కేసులో ఒక తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు ఈ డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరోవైపు, ఫరీదాబాద్‌లో చేపట్టిన తనిఖీల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన తెలుగు ఆఫీసర్ కీ రోల్
Telugu Officer Sandeep Chakravarthy's Key Role

Edited By: Jyothi Gadda

Updated on: Nov 12, 2025 | 12:02 PM

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల భగ్నమైన ఉగ్ర కుట్ర కేసులో ఒక తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. కర్నూల్‌కు చెందిన సందీప్ చక్రవర్తి ఈ కేసులో మొదట లీడ్ ఇచ్చిన అధికారి. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న సందీప్ చక్రవర్తి, గతంలో పెహల్గాం దాడి తర్వాత చేపట్టిన “మహదేవ్ ఆపరేషన్”లోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని బృందం అత్యంత సమర్ధంగా దర్యాప్తు జరిపి ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ఛేదించింది.

జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పోస్టర్లు మొదట కనిపించినప్పుడు, వాటిని గుర్తించి సీసీ కెమెరాల ఆధారంగా పోస్టర్లు అంటించిన వారిని గుర్తించినవారు కూడా సందీప్ చక్రవర్తే. దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులు గతంలో స్టోన్ పెల్టింగ్ కేసుల్లో పాల్గొన్నట్లు బయటపడింది. సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్‌లను అరెస్ట్ చేసి, వారిని రెండు వారాలపాటు విచారించిన సందీప్ చక్రవర్తి అండ్ టీం, వాళ్ల ద్వారా కీలక సమాచారం సేకరించింది. ఆ వివరాలతో “డాక్టర్స్ టెర్రర్ ప్లాట్” మాడ్యుల్ ను చేధించారు.

ఇప్పటివరకు ఈ డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరోవైపు, ఫరీదాబాద్‌లో చేపట్టిన తనిఖీల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 358 కిలోల పేలుడు పదార్థంతో పాటు 2563 కిలోల ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ మెటీరియల్‌ను ఉగ్రవాదులు సమకూర్చుకున్నారని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి.

సందీప్ చక్రవర్తి నేతృత్వంలో సాగిన ఈ ఆపరేషన్‌తో జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఉగ్ర కుట్రను అడ్డగించడం సాధ్యమైంది. తెలుగు అధికారిగా ఆయన చేసిన ఈ సేవలు జాతీయ భద్రతా వ్యవస్థలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..